వైఎస్ వివేకా హత్య కేసు కొలిక్కి రాబోతోందా..?
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంచలనం. 2019 మార్చి 15న ఆయన పులివెందులలోని నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఈ కేసు ఇప్పటి వరకూ కొలిక్కి రాలేదు. నిందితులను అరెస్టు చేసి విచారించినా కోర్టుల్లో ఇంకా కేసు నడుస్తూనే ఉంది. దీనంతటికీ గత ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వమే కారణమనే ఆరోపణలున్నాయి. వైసీపీలోని కొంతమంది ముఖ్యులు ఈ హత్య వెనుక ఉన్నారు కాబట్టే కేసు ముందుకు కదలట్లేదనే విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో త్వరలోనే ఈ కేసు కొలిక్కి రావచ్చని సమాచారం.
ఇటీవల ఓ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివేకా హత్యపై స్పందించారు. బాబాయ్ హత్యకు గురై ఐదేళ్లయినా అధికారంలో ఉండి జగన్ న్యాయం చేయలేకపోయారన్నారు. త్వరలోనే ఆయన హత్యకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు కామెంట్స్ తర్వాత వివేకా హత్య కేసును తేల్చేసేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అందరూ భావిస్తున్నారు. తాజాగా వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత హోంమంత్రి అనితతో సమావేశమయ్యారు. ఈ హత్య చేసిన దోషులెవరో తేల్చాలని అభ్యర్థించారు.
వివేకా హత్య కేసు పరిణామాలు తెలుగు ప్రజలందరికీ తెలుసు. హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు దీనిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబే ఈ హత్య చేయించారని ఆరోపించారు. అయితే రెండు నెలల్లోపే టీడీపీ ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ కేసు ముందుకు సాగలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే హత్య చేసారనే ఆరోపణలున్నాయని.. అందుకే సీఐడీ కాకుండా సీబీఐ ద్వారా ఎంక్వయిరీ కావాలని కోర్టులో సునీత పిటిషన్ వేసి సక్సెస్ అయ్యారు. అయితే సీబీఐకి కూడా ఏపీ ప్రభుత్వం సహకరించలేదు. అధికారులు తనకు సహకరించకపోగా తనపైనే కేసు పెట్టారని సీబీఐ అధికారి వాపోయిన సంఘటనలున్నాయి. దీంతో ఏపీలో ఈ కేసు విచారణ సక్రమంగా సాగట్లేదని భావించిన వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించి తెలంగాణకు బదిలీ చేయించుకున్నారు.
ఐదేళ్లపాటు జగన్ అధికారంలో ఉండడంతో ప్రభుత్వం వైపు నుంచి సరైన సహకారం దొరకలేదు. దీంతో కేసు ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీన్ని ఎలాగైనా కొలిక్కి తీసుకురావాలనే పట్టుదల సునీతకు ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వ పెద్దలను కలిసి కేసును త్వరగా తేల్చాలని కోరారు. సీబీఐకి కావాల్సిన ఆధారాలను ప్రభుత్వం ఇవ్వగలిగితే కేసు ముందుకు కదులుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా ఉంటుంది కాబట్టి త్వరలోనే వివేకా హత్య కేసు కొలిక్కి వస్తుందని.. దోషులెవరో తేలిపోతుందని అంచనా వేస్తున్నారు.