ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వై.ఎస్.షర్మిల బీజేపీ ఏజెంటా..? ఆమె టార్గెట్ కాంగ్రెస్సేనా..?

వై.ఎస్.షర్మిల బీజేపీ ఏజెంటా..? ఆమె టార్గెట్ కాంగ్రెస్సేనా..?

వై.ఎస్.షర్మిల తెలంగాణలో అధికారంలోకి రావడానకి తీవ్రంగా శ్రమిస్తోంది. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల.. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన వెంట పెద్ద నాయకులెవరూ లేకపోయినా తాను ఒంటరి పోరాటమే చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా మాటల తూటాలు పేల్చుతున్నారు. కేసీఆర్ పాలనపైనే ఆమె ప్రధానంగా ఫోకస్ పెట్టారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆమె విరుచుకుపడుతున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచే షర్మిల అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ పైన, ఆయన పాలనా విధానాల పైన మండి పడుతున్నారు. తెలంగాణలో 8 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.. ప్రజలకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. వై.ఎస్.ఆర్. తీసుకొచ్చిన సంక్షేమ విధానాలను తుంగలో తొక్కారని విమర్శిస్తున్నారు. బతుకమ్మ చీరలను కేసీఆర్, కేటీఆర్ తమ సొంత ఖర్చుతో ఇస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. చీరల పైసలు కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ల నుంచి ఇచ్చారా.. లేక కేటీఆర్ బినామీ కంపెనీల నుంచి తెచ్చారా.. లేక ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఇచ్చారా.. అని ప్రశ్నించారు.

మరోవైపు.. సంగారెడ్డిలో జరిగిన పాదయాత్రలో ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై షర్మిల విరుచుకుపడ్డారు. రోజుకో పార్టీ మారడం జగ్గారెడ్డి అలవాటని మండిపడ్డారు. మొదట టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరిన జగ్గారెడ్డి కూడా విలువల గురించి మాట్లాడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. చేతనైతే హామీలు నెరవేర్చాలని జగ్గారెడ్డికి సవాల్ విసిరారు. సంగారెడ్డి కలెక్టర్ పైన కూడా షర్మిల మాటల తూటాలు పేల్చారు. సంగారెడ్డి కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని పని చేస్తున్నాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ నీకు అభినవ అంబేద్కర్ లో ఎలా కనిపించారని నిలదీశారు.

సంగారెడ్డిలో షర్మిల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీనిపై స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. షర్మిల బీజేపీ ఏజెంట్ అని.. అందుకే ఆమె ఆ పార్టీని ఒక్క మాట కూడా మాట్లాడరని ఆరోపించారు. అక్కడ జగన్, ఇక్కడ షర్మిల.. ఇద్దరూ బీజేపీ వెంటే నడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఓట్లను చీల్చి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకే ఆమె పని చేస్తున్నట్టు జగ్గారెడ్డి చెప్పారు. ఆమె వైఎస్ఆర్ వదిలిన బాణం కాదని.. బీజీపీ వదిలిన బాణమని ఎద్దేవా చేశారు. తనను గెలకొద్దని.. తాను నోరు తెరిస్తే బాగోదని షర్మిలను హెచ్చరించారు. తాను పార్టీ మారడానికి మీ అయ్యే కారణమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది వై.ఎస్సేనన్నారు జగ్గారెడ్డి. తన శీలాన్ని ఖరాబ్ చేసింది మీ నాయనేనని.. దీనికి జవాబు చెప్తావా.. అని షర్మిలను ప్రశ్నించారు జగ్గారెడ్డి. మొత్తంగా షర్మిల మాటలకు దీటుగా జవాబిచ్చారు జగ్గారెడ్డి. మరి జగ్గారెడ్డికి షర్మిల ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :