జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్న జగన్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలు ముందే రావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన జనంలోకి వెళ్లి హడావుడి చేస్తున్నాయి. అందుకే అధికార వైసీపీ కూడా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలను ఎదుర్కోవాలంటే జనంలో ఉండడమే మార్గం. గతంలో ప్రతిపక్షంలో ఉండగా జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పాదయాత్ర చేసే అవకాశం లేదు. కానీ ఇప్పటి నుంచి ప్రజల్లోనే ఎక్కువ సమయం గడిపేలా జగన్ కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు. వచ్చే నెల 2 లేదా దసరా నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వైసీపీ 151 సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చింది. అధికారంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకే ఈసారి 175కు 175 సీట్లనూ గెలిచుకోవాలని ఆ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. అది సాధించాలంటే అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులుండాలి. వాళ్లంతా నిత్యం జనంలో ఉండాలి. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వివిధ దశల్లో చేపట్టింది వైసీపీ. దీన్ని జగన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసి నేతల లోటుపాట్లను తెలియజేశారు. సమర్థంగా పని చేయని నేతలను హెచ్చరించారు. టికెట్లు ఇవ్వబోనని కూడా చెప్పశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి సిట్టింగుల్లో చాలా మందికి టికెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఐప్యాక్ సర్వేల్లో పలువురు సిట్టింగులకు నెగెటివ్ మార్కులు వచ్చినట్టు సమాచారం. ఇలాంటి వాళ్ల స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై క్లారిటీ రావాలంటే స్థానిక నాయకత్వం అభిప్రాయాన్ని తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. అందుకే ప్రజా ఆశీర్వాద యాత్ర లేదు జన ఆశీర్వాద యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి అక్కడే నియోజకవర్గాలపై సమీక్ష చేపట్టి అభ్యర్థులను ఖరారు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో నియోజవకరవర్గాలవారీ సమీక్షలను క్యాంప్ ఆఫీసులోనే నిర్వహించారు. అయితే అలా కాకుండా జనంలోకి వెళ్లి స్థానికంగానే నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని జగన్ అంచనా వేస్తున్నారు.
ఈసారి వైసీపీ టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది. కొంతమంది సిట్టింగులు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు గోడ దూకారు. ఇలా.. అన్నింటినీ బేరేజు వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఏ చిన్న పొరపాటు చేసిన అది గెలుపు ఓటములపై ప్రభావం చూపించడం ఖాయం. అందుకే అలాంటి అవకాశం లేకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని జగన్ నిర్ణయించారు.