MKOne Telugu Times Youtube Channel

రెండు వారాల్లో రెండోసారి ఢిల్లీకి జగన్.. ఏంటి సంగతి?

రెండు వారాల్లో రెండోసారి ఢిల్లీకి జగన్.. ఏంటి సంగతి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. సాధారణంగా అయితే సీఎం ఢిల్లీ పర్యటన గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి పర్యటన మాత్రం కచ్చితంగా ఆసక్తి కలిగించేదే. ఎందుకంటే రెండు వారాల వ్యవధిలోనే ఆయన రెండోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఇదిప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు.. ఏ పని మీద వెళ్తున్నారు.. ఇంత వెంటవెంటనే వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది.. లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఎల్లుండి ఆయన ప్రధాని మోదీతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ నెల 17న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రెండు వారాలు కూడా గడవక ముందే ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తుండడం అనేక ఊహాగానాలను తెరలేపుతోంది. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినా ప్రత్యేక హోదా కోసమే కలిశారని వైసీపీ నేతలు చెప్తున్నారు. మొన్న 17వ తేదీ కలిసినప్పుడు కూడా ఇదే అంశాన్ని బయటకు చెప్పారు.

అయితే వివేకానంద హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. రేపోమాపో అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం సాగింది. అయితే జగన్ 17వ తేదీన హుటాహుటిన ఢిల్లీ వెళ్లింది అవినాశ్ ను రక్షించేందుకేనని విపక్షాలు ఆరోపించాయి. మోదీని కలిసిన తర్వాత సుప్రీంకోర్టులో వివేకా కేసు విచారణకొచ్చింది. పిటిషనర్ కోరకపోయినా ఈ కేసు విచారణాధికారిని తప్పించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. జగన్ ఢిల్లీ పర్యటన వల్లే ఇది సాధ్యమైందని విపక్షాలు మళ్లీ ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానికి కృతజ్ఞత చెప్పేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నాయి.

అయితే మరికొందరి ఆలోచన వేరేలా ఉంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారని.. దానికి కేంద్రాన్ని ఒప్పించేందుకే ఢిల్లీ వెళ్తున్నారని చెప్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ శరవేగంగా బలపడుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ఇందుకు పెద్ద ఉదాహరణ. దీన్ని గ్రహించిన జగన్.. టీడీపీ పూర్తిగా బలపడకముందే ఎన్నికలకు వెళ్లి చెక్ పెట్టాలనుకుంటున్నారు. అందుకే ఢిల్లీకి హుటాహుటిన వెళ్తున్నారని కొందరు భావిస్తున్నారు. మరి ఆయన ఎందుకు వెళ్తున్నారో అధికారికంగా తెలియాల్సి ఉంది.

 

 

Tags :