Radha Spaces ASBL

వై.ఎస్.అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదా..?

వై.ఎస్.అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదా..?

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టే కనిపిస్తోంది. వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వై.ఎస్.అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈరోజు అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలవడంపై అవినాశ్ రెడ్డి ఆక్షేపణ తెలిపారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానన్నారు. అయితే అవినాశ్ రెడ్డి లేఖపై సీబీఐ స్పందించలేదు. ఆయనకు ఐదు రోజులు అనుమతి ఇస్తుందా.. లేదా.. అనేది తెలీదు. మరోవైపు ఇవాళ అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. దీంతో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య ఏపీలో తీవ్ర సంచలనం కలిగించింది. అత్యంత దారుణంగా బాత్రూంలో వివేకానంద రెడ్డిని హత్య చేశారు. అయితే ఆయనది గుండెపోటు అని మొదట ప్రకటించారు. అయితే ఆ తర్వాత అది హత్య అని తేల్చారు. అయితే ఈ హత్య చేసిందెవరు.. ఎందుకింత దారుణంగా హత్య చేశారనేదానిపై అనేక అనుమానాలు తలెత్తాయి. మొదట డ్రైవర్ పైన, ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యుల పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఈ కేసు నీరుగారిపోతుందని భావించారు. అయితే వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు కూడా ఇదే విషయం చెప్పడంతో జగన్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది.

అయితే కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత కూడా విచారణ ముందుకు సాగలేదు. కడప కేంద్రంగా సీబీఐ ఈ కేసును విచారించింది. అయితే స్థానిక పోలీసులు, అధికారులు తమకు సరిగా సహకరించలేదని సీబీఐ న్యాయస్థానానికి చెప్పింది. ఇదే పరిస్థితి ఉంటే కేసును ముందుకు తీసుకెళ్లడం కష్టమని చేతులెత్తేసింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా కేసును మరేదైనా రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరింది. సీబీఐ కూడా ఇదే సరైన నిర్ణయమని కోర్టుకు చెప్పడంతో సుప్రీంకోర్టు కేసును తెలంగాణకు బదలాయించింది. ఇప్పుడు తెలంగాణ నుంచి వివేకా హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వడం సంచలనం కలిగించింది.

వివేకా హత్య కేసు విచారణ ఏపీలో జరిగినప్పుడు అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు సీబీఐ. అప్పుడు తమకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని సీబీఐ సాక్షాత్తూ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఇప్పుడు సీబీఐ దూకుడు పెంచింది. సోమవారం సీబీఐ అధికారులు పులివెందులలో పర్యటించారు. వైసీపీ కార్యాలయానికి వెళ్లి అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. అదే రోజు మధ్యాహ్నానికి అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సీబీఐ. అయితే తనకు ఐదు రోజులు సమయం కావాలని అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. అయితే ఇందుకు సుముఖంగా లేని సీబీఐ.. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుందనే వార్తలు గుప్పు మంటున్నాయి. ఏ క్షణమైనా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని సమాచారం.

మరోవైపు ఈ కేసుపై అవినాశ్ రెడ్డి తొలిసారి నోరు విప్పారు. నిజం బయటకు రావాలన్నదే తమ ఉద్దేశమన్నారు. మొదటి నుంచి ఒక వర్గం మీడియా తమకు అంటగడుతూ అనేక వార్తలు రాసిందని.. దీనివల్ల తామెంతో బాధపడ్డామని చెప్పారు. అభియోగాలు మోపేటప్పుడు ఎదుటివాళ్ల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. ఈ కేసులో నిజాలు తప్పకుండా బయటకు రావాలనే తాము కోరుకుంటున్నామన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :