ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ వార్.. ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్..!!

టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ వార్.. ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్..!!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పార్టీల మధ్య వార్ ఉధృతమవుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య పోరు నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఏడాది ముందే తెలుగుదేశం పార్టీ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించింది. భవిష్యత్తుకు భరోసా పేరుతో చంద్రబాబు సమరశంఖం పూరించారు. అయితే రేసులో తాము వెనుకబడుతున్నామని వైసీపీ గ్రహించిందో ఏమో.. టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. టీడీపీ గత మేనిఫెస్టోలను తీసుకుని వాటిని ఏమేరకు అమలు చేసిందో చెప్పే ప్రయత్నం చేయనుంది.

తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో పాక్షికంగా మేనిఫెస్టోను ప్రకటించింది. భవిష్యత్తుకు భరోసా పేరుతో చంద్రబాబు ఆరు పథకాలను అనౌన్స్ చేశారు. మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ తాగునీరు, బీసీలకు రక్షణచట్టం, పూర్ టు రిచ్ పేరుతో కొత్త స్కీమ్స్ అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ మేనిఫెస్టో ఏపీలో పెద్ద చర్చకే దారితీసింది. కర్నాటకలో కాంగ్రెస్ అమలు చేసిన పథకాలను టీడీపీ కాపీ కొట్టిందని కొందరు విమర్శించారు. అయితే ఆ విమర్శలను టీడీపీ పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న పథకాలు కూడా నాడు చంద్రబాబు అమలు చేసినవేనని. వాటికి పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు.

టీడీపీ ఏడాది ముందే మేనిఫెస్టో ప్రకటించడంతో ప్రజల్లో పెద్ద చర్చకు తావిచ్చింది. టీడీపీ అమలు చేస్తామని చెప్పిన వాటిలో కొన్ని నేరుగా ప్రజలపై ప్రభావం చూపించనున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఆడబిడ్డ నిధి కింద జమ చేస్తామని చెప్పడం, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ రూ.15వేల చొప్పున ఇస్తామనడం, ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, జిల్లాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. లాంటి వాటిపై మహిళలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మహిళల ఓట్లు రాబట్టుకునేందుకు ఈ పథకం బాగా దోహదపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కేడర్ ను ఆదేశించారు.

అయితే టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ కలవరపడుతున్నట్టు సమాచారం. టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలు ఎక్కడ ప్రభావితులవుతారోనని భయపడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే టీడీపీ మేనిఫెస్టోను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. గతంలో టీడపీ ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేసిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారిలో మార్పు తీసుకురావాలని భావిస్తోంది. చంద్రబాబు హామీలు అమలు చేసిన తీరును జగన్ హామీలతో పోల్చుతూ బహిరంగ చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే గుంటూరులో ఏ మేరకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది వైసీపీ. ఇలా ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టోపై అధికార పార్టీ చర్చ చేపట్టడం రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి దారీ తీస్తుందేమో..!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :