వైసీపీ బీసీ జపం..! టీడీపీకి మరింత దూరం చేయడమే లక్ష్యమా..!?

వైసీపీ బీసీ జపం..! టీడీపీకి మరింత దూరం చేయడమే లక్ష్యమా..!?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయమంతా బీసీల చుట్టూ తిరుగుతోంది. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ తాము బీసీల పక్షపాతి అని చెప్పుకుంటోంది. వాస్తవానికి ఎన్నో ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది బీసీలే. అయితే ఇప్పుడు వైసీపీ కూడా తామే బీసీల పక్షం అంటోంది. తాము అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో గతంలో ఎన్నడూ జరగనంత మేలు బీసీలకు జరిగిందని చెప్తోంది. ఇదే విషయాన్ని చాటి చెప్పేందుకు రేపు విజయవాడలో జయహో బీసీ మహాసభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

విజయవాడలో తలపెట్టిన జయహో బీసీ మహాసభను దిగ్విజయం చేసేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది బీసీ ప్రజాప్రతినిధులు ఈ సభకు వస్తారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీకి చెందిన వార్డు మెంబర్ల నుంచి అత్యున్నతస్థాయి మంత్రుల వరకూ అందరూ ఈ మహాసభకు తరలి రానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సభలో సీఎం జగన్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా తాము ఈ మూడున్నరేళ్లలో బీసీలకు ఏం చేశామో చెప్పేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజాప్రతినిధులందరూ ఈ సమావేశానికి వస్తారని.. వారికి ఈ వివరాలన్నీ తెలియజేయడం ద్వారా వారంతా తమ ఊళ్లలో తాము చేసిన లబ్దిని తెలియజేస్తారని వైసీపీ ప్లాన్.

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు సీఎం జగన్. తన పాదయాత్రలో గుర్తించిన అనేక అంశాలను అడ్రస్ చేస్తూ పలు కార్యక్రమాలను బీసీలకోసం ఏర్పాటు చేశారు. అంతేకాక కేబినెట్లో 11 మంది బీసీ మంత్రులను చేర్చుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా బీసీనే. అలాగే 56 కార్పొరేషన్లను బీసీలకు కట్టబెట్టారు. అలాగే పలు కార్పొరేషన్ల డైరెక్టర్లుగా బీసీలకు పెద్దఎత్తున అవకాశం ఇచ్చారు. అలాగే నగర మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు .. ఇలా అనేక పదవులను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు సీఎం జగన్. కొన్ని జనరల్ సీట్లను కూడా బీసీలకు కేటాయించారు. రాజ్యసభ సభ్యులుగా బీసీలైన ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాశ్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావ్.. తదితరులను ఎంపిక చేశారు. బీసీలంటే మొదట గుర్తొచ్చేది కృష్ణయ్యే. అలాంటి కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా తామే నిజమైన బీసీ పక్షపాతి అని చెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ.

అయితే.. తెలుగుదేశం పార్టీ మాత్రం వైసీపీ బీసీ మహాసభను ఎద్దేవా చేస్తోంది. తాము 2018లో పెట్టుకున్న జయహో బీసీ పేరునే గతిలేక వైసీపీ ఇప్పుడు పెట్టుకుందని విమర్శిస్తోంది. ఎన్ని కల్లిబొల్లి కబుర్లు చెప్పినా బీసీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇలా విమర్శలు - ప్రతివిమర్శల నేపథ్యంలో రేపు విజయవాడలో వైసీపీ బీసీ మహాసభను నిర్వహిస్తోంది. ఈ సభ ద్వారా బీసీలను మరింత అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

 

 

Tags :