ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తిరుమలలో భద్రతా వైఫల్యం.. సోషల్ మీడియాలో ఆలయ లోపలి దృశ్యాలు..!

తిరుమలలో భద్రతా వైఫల్యం.. సోషల్ మీడియాలో ఆలయ లోపలి దృశ్యాలు..!

తిరుమల భద్రత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలికాలంలో భద్రతాపరమైన లోపాలు అనేకం వెలుగు చూశాయి. ఇప్పుడు ఏకంగా ఆలయం లోపలికి ఓ భక్తుడు మొబైల్ తీసుకెళ్లి వీడియో తీయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సెక్యూరిటీ సరిగా విధులు నిర్వర్తించకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పదేపదే వెలుగులోకి వస్తున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

తిరుమల వెళ్లాలంటూ అనేక భద్రతాపరమైన చర్యలను ఎదుర్కొని వెళ్లాల్సి ఉంటుంది. అలిపిరి దగ్గరే మొదటి విడత చెకింగ్ జరుగుతుంది. బస్సయినా, ఫోర్ వీలర్ అయినా, టూ వీలర్ అయినా భక్తులంతా దిగి తనిఖీ చేయించుకోవాలి. బ్యాగులు మొదలు బాడీ వరకూ మొత్తం చెక్ చేస్తారు. చాలా వరకూ ఇక్కడే పట్టుబడుతుంటారు. గంజాయి, మాంసం, సిగరెట్లు, మద్యం.. లాంటివి తీసుకెళ్తూ ఎంతోమంది ఇక్కడ దొరికిపోతుంటారు. ఇక్కడ తప్పించుకుంటే తిరుమలలో మరేం భయం లేదనే ధీమా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది.

తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులే ధరించాల్సి ఉంటుంది. జీన్స్ లాంటివి వేసుకోకూడదు. సెల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లకూడదు. భక్తులు క్యూలైన్లలోకి వెళ్లే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తారు. ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందు ముఖ ద్వారం వద్ద మరోసారి తనిఖీ చేస్తారు. బ్యాగులేవైనా తీసుకెళ్తుంటే స్కానర్ లో తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా తెలియక మొబైల్ లాంటివి క్యూలైన్ లోకి తీసుకొస్తే.. ప్రధాన ఆలయ ముఖ ద్వారం వద్ద దొరికిపోతుంటారు. అప్పుడు ఆ మొబైల్స్ ను సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకుని లోపలికి పంపిస్తుంటారు.

ఇప్పుడు శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన ఓ వ్యక్తి లోపలి దృశ్యాలను చిత్రీకరించాడు. బంగారు గోపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని వీడియో తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఆ భక్తుడ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. మొబైల్ ద్వారా కాకుండా పెన్ కెమెరా ద్వారా ఆ వీడియోలను చిత్రీకరించి ఉండొచ్చని వెల్లడించింది. ఏదైతేనేం ఇది కచ్చితంగా భద్రతాలోపమే. భక్తులకు ఆలయ నియమ నిబంధనలు తెలియకపోతే వెల్లడించాల్సిన బాధ్యత టీటీడీదే. అంతేకాక క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి. అడుగడుగునా తనిఖీలు చేసినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయంటే సెక్యూరిటీపై టీటీడీ పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :