ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాంగ్రెస్‌లో కర్నాటక జోష్.. తెలంగాణపై ఫోకస్ పెంచిన హైకమాండ్..!!

కాంగ్రెస్‌లో కర్నాటక జోష్.. తెలంగాణపై ఫోకస్ పెంచిన హైకమాండ్..!!

కలసికట్టుగా పని చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని నిరూపించారు కర్నాటక కాంగ్రెస్ నేతలు. నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నా తిరుగులేని మెజారిటీతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇదే ఉత్సాహంతో దేశవ్యాప్తంగా ఉన్న నేతలంతా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదని భావిస్తోంది ఆ పార్టీ హైకమాండ్. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది మాత్రమే సమయం ఉండండంతో కర్నాటక జోష్ ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టి పెడుతోంది. వచ్చే వారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ రావాలని ఆదేశించింది.

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలూ మేల్కొంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కాస్త ముందుందని చెప్పొచ్చు. కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. అదే జోష్ ను తెలంగాణలో కూడా కంటిన్యూ చేయాలనుకుంటోంది. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని తపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది. కానీ అప్పటి నుంచి అధికారంలోకి మాత్రం రాలేకపోతోంది. అందుకే ఈసారి తెలంగాణ నినాదాన్ని మళ్లీ ప్రజల వద్దకు తీసుకెళ్లాలనుకుంటోంది. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే.. నినాదాన్ని మరోసారి వాడవాడలా వినిపించాలనుకుంటోంది.

ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న మరో ముఖ్యమైన సమస్య అంతర్గత విభేదాలు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో ముందు నుంచి ఉన్న సీనియర్లు అస్సలు సహకరించట్లేదు. అయినా రేవంత్ రెడ్డికి మాత్రం హైకమాండ్ అండగా నిలుస్తోంది. సీనియర్లు ఎన్ని మాటలంటున్నా రేవంత్ రెడ్డి మాత్రం తనపని తాను చేసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డికి పగ్గాలివ్వడాన్ని అస్సలు జీర్ణించుకోలేని పలువురు నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల పార్టీ పరువు బజారున పడుతోంది. హైకమాండ్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు సక్రమంగా జరగట్లేదు. ఇది పార్టీని బలహీన పరుస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల వరకూ తెలంగాణలో కాంగ్రెస్ కు మూడో స్థానమే అనే ప్రచారం జరిగింది.

అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారింది. నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కలిసికట్టుగా పని చేస్తే ఇక్కడ కూడా విజయం సాధించవచ్చనే భావన కలుగుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణ నేతలకు క్లాసీ తీసుకోవడం వర్కవుట్ అయింది. ఇప్పుడు కూడా మరోసారి నేతలను ఢిల్లీ పిలిపిస్తోంది. 8న రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత 9 లేదా 10 తేదీల్లో తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అంతర్గత విభేదాలు, మేనిఫెస్టో.. లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గంతో పాటు కీలక నేతలందరినీ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. కర్నాటక తరహాలోనే తెలంగాణలో కూడా తాము అధికారంలోకి రాబోతున్నామని అమెరికాలో కూడా రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో అదే పట్టుదలతో పని చేసేలా కేడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :