తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్..! నేతలు విభేదాలను పక్కన పెట్టినట్టేనా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కర్నాటక ఎన్నికలు తీసుకొచ్చిన ఉత్సాహం తెలంగాణలోనూ కనిపిస్తోంది. పార్టీ పనైపోయిందని, ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమని అందరూ భావిస్తున్న సమయంలో కర్నాటక ఎన్నికలు మలుపు తిప్పాయి. బీజేపీని ఎదుర్కోగల సత్తా కాంగ్రెస్ కు ఇంకా ఉందని నిరూపించాయి. ఇదే ఉత్సాహంతో పని చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు రాబట్టుకోగలదనే ధీమా ఇప్పుడు వ్యక్తమవుతోంది. అందుకే ఆ టెంపోను కంటిన్యూ చేయాలనుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటివరకూ నేతల మధ్య విభేదాలు సమసిపోలేదు. ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించినా మార్పు లేదు. ఎవరి గోల వారిదే. కాంగ్రెస్ లో ఇంతే అనే సెటైర్లు కామన్ అయిపోయాయి. అందరూ అధిష్టానం దగ్గర తేల్చుకుందాం అనుకునే వాళ్లు తప్ప కూర్చొని మాట్లాడుకుని పార్టీని బతికిద్దాం అనే ఆలోచన ఒక్కరికీ లేదు.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలు తీసుకొచ్చిన ప్రభావమో ఏమో.. నేతలంతా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అధిష్టానం కూడా తెలంగాణ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. వరుస మీటింగులు షెడ్యూల్ చేసింది. ఎల్లుండి భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా జడ్చర్లలో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో పాల్గొనేందుకు నేతలంతా ఏకతాటి పైకి వచ్చారు. అనంతరం 26న ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో నేతలంతా భేటీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు.
నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని.. కర్నాటకలో అలాగే విజయం సాధ్యమైందని పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రె నేతలకు దిశానిర్దేశం చేశారు. అక్కడ కూడా డికే, సిద్ధరామయ్య మధ్య గ్యాప్ ఉన్నా.. ఎన్నికలకోసం వాటన్నిటినీ పక్కనపెట్టి పని చేయడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పారు. ఇక్కడ కూడా నేతలంతా కలసికట్టుగా పని చేయాలని, హైదరాబాద్ వదిలేసి ప్రజల్లోకి వెళ్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. హైదరాబాద్ లో హడావుడి చేస్తే టికెట్ వస్తుందనుకోవడం భ్రమే అని స్పష్టం చేశారు. అంతర్గత సర్వే ఆధారంగానే టికెట్లు ఉంటాయని ప్రకటించారు. దీంతో నేతల్లో వణుకు మొదలైంది. అధిష్టానం కాస్త గట్టిగానే దృష్టి పెట్టడంతో ఇకనైనా నేతల్లో మార్పు వస్తుందని భావిస్తున్నారు.






