ఆశల పల్లకిలో తెలుగుదేశం..! ఆశలన్నీ జనసేన పైనే..!!

ఆశల పల్లకిలో తెలుగుదేశం..! ఆశలన్నీ జనసేన పైనే..!!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా తాము గెలిచి తీరుతామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంపై ప్రజలు విసిగి వేసారిపోయారని.. అరాచకాలను భరించలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటీవలికాలంలో చంద్రబాబు పర్యటనలకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుండడమే ఇందుకు కొలమానమని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఎక్కడో ఏదో అనుమానం ఆ పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది. ఒంటరిగా వెళ్తే అధికారంలోకి వస్తామా.. రాలేమేమో.. అనే సందేహం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఆశలన్నీ జనసేన పైనే పెట్టుకుంది టీడీపీ. మరి టీడీపీతో కలిసేందుకు జనసేన సిద్ధంగా ఉందా..? అనేదే ఇప్పుడు ప్రశ్న.

2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీకి ప్రజలు పట్టం కట్టకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవుతుందని.. అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రకటించారు. కాబట్టి ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాదు.. ఇదే తనకు చివరి అవకాశమని.. సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే చంద్రబాబు సభలకు కర్నూలు జిల్లాలో విశేష స్పందన లభించింది. జనం పెద్దఎత్తున తరలివచ్చారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కర్నూలు జిల్లాలో టీడీపీ గెలవలేదు. అలాంటి జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు సభలకు ఈ స్థాయిలో జనం రావడంతో టీడీపీ శ్రేణులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాయి. ఇది ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనమని నమ్ముతున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీదే విజయమని.. ప్రజలు ఇప్పటికే ఆ మేరకు నిర్ణయం తీసేసుకున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీకి కేడర్ పెద్ద మైనస్ గా మారింది. చాలా చోట్ల నేతలు డీలా పడిపోయారు. పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో ఎంతో యాక్టివ్ గా ఉన్న నేతలు సైతం ఇప్పుడు గడప దాటట్లేదు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనట్లేదు. చంద్రబాబు కార్యక్రమాలకు కూడా డుమ్మా కొట్టిన నేతలున్నారు. యాక్టివ్ అయితే ప్రభుత్వం ఏ కేసులో ఇరికిస్తుందోననే భయం చాలా మంది టీడీపీ నేతలను వెంటాడుతోంది. అందుకే ఇకపై ఆలాంటి నేతలను పక్కన పెట్టి యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. నేతలు బలహీనంగా ఉన్నచోట వైసీపీ స్ట్రాంగ్ అవుతుందని.. అలా కాకుండా నేతలు ఎదురొడ్డి పోరాడినప్పుడే పార్టీ నిలబడుతుందని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకూ నేతలు పాటిస్తారనేది అనుమానంగానే ఉంది.

మరోవైపు ఒంటరిగా వెళ్లడం కంటే జనసేనతో కలిసి వెళ్లాలనే కోరిక టీడీపీలో బలంగా కనిపిస్తోంది. విశాఖ గర్జన తర్వాత టీడీపీ- జనసేన మధ్య మళ్లీ ఆ పరిస్థితి కూడా కనిపించింది. పవన్ కల్యాణ్ ను వెళ్లి చంద్రబాబు కలిసిన తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైందనే భావించారు. అయితే ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో పవన్ కల్యాణ్ వెళ్లి ఆయన్ను కలిసిన తర్వాత సీన్ మారిందని చెప్తున్నారు. టీడీపీతో కాకుండా బీజేపీతో కలిసి వెళ్లాలనే ఉద్దేశంతోనే జనసేనాని ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి వెళ్లడమే మంచిదనే అభిప్రాయంతో పవన్ కల్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే టీడీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లే. కానీ వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పవన్ కల్యాణ్ కచ్చితంగా తమతో కలిసి వస్తారనే నమ్మకం ఇప్పటికీ టీడీపీలో ఉంది. మరి చూడాలి.. ఏం జరుగుతుందో..!

 

 

Tags :