BRSకు ఊపిరి పోస్తున్న రేవంత్ రెడ్డి..!?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో (Telugu States) పాలిటిక్స్ (Politics) లో పస ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS).. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా అదే పంథాలో పయనిస్తున్నారు. నాడు బీఆర్ఎస్ తమను ఎంత ఇబ్బంది పెట్టిందో గుర్తు చేసుకుని మరీ ఎత్తులు వేస్తున్నారు. అయితే రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడు గురి తప్పుతుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పైగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో కేసీఆర్ (KCR) కు సరైన మొగుడు దొరికారని అందరూ అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై ఒంటికాలిపై లేచేవారు. బీఆర్ఎస్ ను తన మాటలతోనే ముప్పతిప్పలు పెట్టారు. బీఆర్ఎస్ అంతు చూసే వరకూ నిద్రపోనని రేవంత్ పలు సందర్భాల్లో చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను తనవైపు తిప్పుకున్నారు. ఇదే జోరుతో బీఆర్ఎస్ ఎల్పీని (BRSLP) కూడా విలీనం చేసుకుంటారనే టాక్ నడిచింది.
అయితే కారణాలేవైనా కావచ్చు.. రేవంత్ హవా తగ్గుతోంది. రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు బీఆర్ఎస్ కు ఊపిరి పోస్తున్నాయి. మొదటి ఆరు నెలలు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ వచ్చారు. అయితే పరిపాలనాపరంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీకి కలిసొస్తున్నాయి. ముఖ్యంగా హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, హైడ్రా (HYDRAA), ఫోర్త్ సిటీ (Forth City), మెట్రో అలైన్మెంట్ లో మార్పులు.. లాంటివి బీఆర్ఎస్ కు ఆయుధాలుగా మారాయి. వీటినే ఇప్పుడు బీఆర్ఎస్ అస్త్రాలుగా చేసుకుని దూకుడు ప్రదర్శిస్తోంది.
బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ కాలేకపోయారు. అనుకున్నంత మంది నేతలను లాగడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. దీంతో రేవంత్ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం బీఆర్ఎస్ కు లభించింది. వీటిని అందిపుచ్చుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెరవెనుక కేసీఆర్ తనదైన వ్యూహాలతో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పనైపోయిందనుకుంటున్న సమయంలో మళ్లీ ఉవ్వెత్తున ఎగసి పడుతోంది ఆ పార్టీ. ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన అవకాశంగానే భావించాలి.