రాహుల్‌ను రాటుదేల్చుతున్న బీజేపీ..!?

రాహుల్‌ను రాటుదేల్చుతున్న బీజేపీ..!?

కొంతకాలం క్రితం వరకూ రాహుల్ గాంధీ పేరు వినిపిస్తే చాలు.. చాలా చిన్నచూపు చూసేవాళ్లు. ఆయన్ను పప్పు అని విపక్ష నేతలు ఎద్దేవా చేసేవారు. అతనికి రాజకీయాలు తెలీవని, పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తారని, కీలక సమయాల్లో విదేశాలకు పారిపోతారని... ఇలా ఎన్నో కామెంట్స్ అయనపై వినిపించేవి. రాహుల్ కూడా అలాగే కనిపించేవారు. కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు విదేశాలకు చెక్కేసేవారు. లేదంటే హిమాలయాలకు వెళ్ల సేద తీరేవారు. ఇదేంటి రాహుల్ ఇలా చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శించే వాళ్లు. కానీ ఇప్పుడు రాహుల్ అలా లేరు.

కాంగ్రెస్ పార్టీ పతనానికి రాహుల్ గాంధీయే కారణమని 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఏకమయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేశారు. రాహుల్ ఆధ్వర్యంలో తాము పనిచేయలేమని అల్టిమేటం జారీ చేశారు. కానీ అలాంటి బెదిరింపులకు రాహుల్ కానీ, సోనియా గాంధీ వణకలేదు. ఉండేవాళ్లు పార్టీలో కంటిన్యూ అయ్యారు. కొందరు పార్టీని వదిలి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు ఆ రాహుల్ గాంధీయే పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు. పార్టీలో ఇప్పుడు రాహుల్ అధ్యక్షుడు కాదు. ఒక సామాన్య కార్యకర్త. ఇంతకుముందు లాగా ఇప్పుడు ఎంపీ కూడా కాదు. ఒక మాజీ ప్రజాప్రతినిధి.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం కాంగ్రెస్ పార్టీలో కసి రగిల్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీలో మరింత పట్టుదల వచ్చింది. తనపై అన్యాయంగా వేటు వేశారని రాహుల్ భావించారు. అదానీ వ్యవహారంలో రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ పారిపోయింది. లోక్ సభలో రాహుల్ లేచి మాట్లాడడం మొదలు పెట్టగానే మైక్ కట్ అయిపోయేది. రాహుల్ సభలో ఉంటే అదానీ అంశాన్ని వదిలిపెట్టరని భావించిన బీజేపీ.. ఆయనపై వేటు వేసిందనేది వాస్తవం. అంతేకాక ఇల్లు కూడా ఖాళీ చేయించింది. కానీ అదే ఇప్పుడు రాహుల్ ను రాటు దేల్చుతోంది.

భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు రాహుల్ గాంధీ. వాళ్లతో మమేకం అయ్యారు. అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం అనర్హత వేటు పడిన తర్వాత మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా లారీ ఎక్కి డ్రైవర్ల జీవనశైలిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇటీవలికాలంలో బస్సులు, లారీలు, బైకులు.. ఇలా దేన్నీ రాహుల్ వదిలిపెట్టలేదు. అందరితో మమేకం అవుతున్నారు. టీకొట్లు, హోటళ్లకు బాతాఖానీ పెడ్తున్నారు. మోదీ మన్ కీ బాత్ అని రేడియోకు పరిమితం అయితే రాహుల్ గాంధీ నేరుగా ప్రజల్లోకి వెళ్లి మన్ కీ బాత్ అంటున్నారు. ఒక సామాన్యుడిలో వాళ్లలో కలిసిపోతున్నారు. ఇంతకుముందు రాహుల్ గాంధీకి, ఇప్పటి రాహుల్ గాంధీకి చాలా తేడా ఉందని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. కర్నాటక ఎన్నికల్లో విజయం, ఆ తర్వాత రాహుల్ గాంధీ పనితీరు.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు. అధికారం దక్కుతుందో లేదో కానీ రాహుల్ గాంధీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే మాత్రం ఒక మంచి నేతగా ఎదుగుతారు. ఇందుకు కచ్చితంగా కారణం బీజేపీయే.!

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :