ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క్లారిటీకి వచ్చేసిన పొంగులేటి, జూపల్లి..! జూన్ 8నే చేరిక..!!

క్లారిటీకి వచ్చేసిన పొంగులేటి, జూపల్లి..! జూన్ 8నే చేరిక..!!

తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలను బీఆర్ఎస్ బహిష్కరించిన తర్వాత ఏ పార్టీలో చేరతారో అర్థం కాలేదు. వాళ్లు కూడా క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు. కొంతకాలం బీజేపీతో, మరికొంతకాలం కాంగ్రెస్ తో చర్చలు జరుపుతూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చారు. దీంతో ఏ పార్టీలో చేరతారో అర్థం కాక వాళ్ల అనుచరులు కూడా ఊగిసలాట ధోరణిలో మునిగిపోయారు. అయితే ఇప్పుడు ఇద్దరు నేతలూ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కు దూరమయ్యారు. వాళ్లిద్దరినీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో వాళ్లు కూడా పట్టించుకోవడం మానేశారు. పైగా పార్టీ అధిష్టానంపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం వాళ్లను బహిష్కరించింది. అప్పటికే పార్టీతో గ్యాప్ పెరగడంతో దానిపై వాళ్లు పెద్దగా ఆలోచించలేదు. అంతా తమ మంచికే అనుకున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లిని తమ పార్టీల్లోకి లాక్కోవాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించాయి.

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఖమ్మంలో పొంగులేటి ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇటీవల ఈటల రాజేందర్ ఇంటికి పొంగులేటి, జూపల్లి వెళ్లారు. దీంతో బీజేపీలోకి వెళ్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే కేసీఆర్ ను ఓడించేందుకు బీజేపీ దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటని పొంగులేటి, జూపల్లి ప్రశ్నించారు. అంతేకాక పైన హడావుడి చేయడం తప్ప క్షేత్రస్థాయిలో బీజేపీకి అంత పట్టు లేదనే విషయాన్ని కూడా వాళ్లు లేవనెత్తినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మంలో బీజేపీ శూన్యమని, అలాంటి పార్టీలో చేరితే మొదటికే మోసం వస్తుందని పొంగులేటి స్పష్టం చేసినట్టు సమాచారం.

బీజేపీతో వెళ్తే ఉపయోగం ఉండదని, దాంతో పోల్చితే కాంగ్రెస్ నయమని పొంగులేటి, జూపల్లి నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ తో వాళ్లిద్దరికీ అనుబంధం ఉంది. పైగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీకి తన బలం తోడైతే బీఆర్ఎస్ ను ఓడించడం ఈజీ అనే ఫీలింగుకు పొంగులేటి వచ్చారు. అందుకే బీజేపీ ఎంత ప్రయత్నించినా, ఈటల ఎంత బుజ్జగించినా పొంగులేటి, జూపల్లి అటువైపు మొగ్గు చూపలేదు. కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం జూన్ 8ని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. వాస్తవానికి రాష్ట్రావతరణ దినోత్సవం అయిన జూన్ 2నే చేరాలనుకున్నారు. అయితే మంచి ముహూర్తం లేకపోవడంతో జూన్ 8కి వాయిదా వేసుకున్నారు. భారీ బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :