రాజకీయాలకు పేర్ని నాని గుడ్ బై.. జగన్‌తో ఇది చివరి మీటింగ్ అని కామెంట్..!!

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ నుంచి పలువురు ఔత్సాహికులు టికెట్ ఆశిస్తున్నారు. అన్ని పార్టీల్లో వారసులను రంగంలోకి దింపేందుకు సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారు. అలా వారసులకు టికెట్లు ఆశిస్తున్న వాళ్లలో వైసీపీలో ఎక్కువ మంది నేతలు ఉన్నారు. వారిలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఒకరు. కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపాలని నాని ఆసక్తిగా ఉన్నారు. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఇవాళ జగన్ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాల నుంచి త్వరలో తప్పుకోబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. బందరు పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తో ఇదే తనకు చివరి సమావేశం కావచ్చన్నారు. ఇకపై తాను రాజకీయాల్లో ఉంటానో ఉండనో తెలియదన్నారు. పక్కనున్న వ్యక్తి ఏదో అనడంతో.. హా.. అవును.. రిటైర్ అవుతున్నాను.. అని క్లియర్ కట్ గా చెప్పేశారు. జగన్ తో తనకు ఇదే చివరి సమావేశం అని చెప్పడం, తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడం అక్కడివారికి ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించింది.
ముఖ్యమంత్రి జగన్ తో తాను పాల్గొనబోయే చివరి సమావేశం ఇదే కావచ్చని పేర్ని నాని బహుశా ముందే డిసైడ్ అయినట్లున్నారు. అందుకే సమావేశంలో జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వయసులో చిన్నవాడు అయిపోయాడు కాబట్టి ఊరకుంటున్నానని, లేకుంటే పాదాభివందనం చేసే వాణ్ణని చెప్పుకొచ్చారు. బందరుకు అడిగినవన్నీ ఇచ్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. మెడికల్ కాలేజీ ఇచ్చారని, అలాగే ఇక్కడ ఏకంగా ఒక కాలనీనే నిర్మిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు బందరు పోర్టు ద్వారా ఈ ప్రాంత రూపురేఖలను మార్చబోతున్నారని పేర్నినాని కొనియాడారు.
కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పేర్ని నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జగన్ తో ముందు నుంచి నడిచిన ఆయన .. వైసీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ కు నమ్మిన వ్యక్తిగా ఉన్నారు. తనను మంత్రివర్గం నుంచి తప్పించినా పార్టీకోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా.. కుమారుడు కృష్ణమూర్తిని తన సీటు నుంచి వైసీపీ తరపున బరిలోకి దించబోతున్నారు. మొత్తానికి చాలాకాలంగా పేర్ని నాని రాజకీయ విరమణపై మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.