నయనతార సరోగసీ చుట్టూ వివాదాలు .. ఆధారాలు సమర్పించాలన్న తమిళనాడు ప్రభుత్వం

నయనతార సరోగసీ చుట్టూ వివాదాలు .. ఆధారాలు సమర్పించాలన్న తమిళనాడు ప్రభుత్వం

సినీ నటి నయనతార, దర్శకుడు విగ్నేశ్ శివన దంపతులు సరోగసీ ద్వారా కవలలను జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే వారి పెళ్లయి నాలుగు నెలలే కావడం.. ఇంతలోనే అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనివ్వడం పలు వివాదాలకు తావిస్తోంది. వారు పిల్లలు కన్న తీరు సరిగా లేదంటూ పలువురు ఆక్షేపిస్తున్నారు. ఈ అంశంపై వివాదాలు తలెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పిల్లలకు ఎలా జన్మనిచ్చారో వివరాలు సమర్పించాలని నయనతార - విగ్నేశ్ శివన్ దంపతులను ఆదేశించింది.

తమకు కవల పిల్లలు జన్మించారంటూ ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నయనతార - విగ్నేశ్ శివన్ దంపతులు. వాళ్లిద్దరికీ పేర్లు కూడా పెట్టారు. ఉయిర్, ఉలగమ్ అని వీరికి నామకరణం చేసినట్లు ప్రకటించారు. కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. దేవుడు డబుల్ గ్రేట్ అని కొనియాడారు. తమకంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పిల్లల అంశం వారికి పెద్ద తలనొప్పిగా మారింది. దీని చుట్టూ అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి.

నయనతార - విగ్నేశ్ శివన్ వివాహం జూన్ 9న జరిగింది. అంటే వీరికి వివాహమై కేవలం నాలుగు నెలలే అయింది. ఇంతలోనే వారికి కవలలు జన్మించారు. అయితే వాళ్లు చాలాకాలంగా కలిసి ఉంటున్నారు కాబట్టి ఇదేమంత పెద్ద విషయం కాకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే సరోగసీని మన దేశంలో నిషేధించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. గర్భం దాల్చేందుకు అవకాశం లేని దంపతులు తప్ప.. వేరెవరూ సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి చట్టం ఒప్పుకోదు. ఈ చట్టం అమల్లో ఉన్న ప్రస్తుత సమయంలో సరోగసీ ద్వారా నయనతార - విఘ్నేశ్ దంపతులు పిల్లలకు జన్మనివ్వడం వివాదాలకు కేంద్రబిందువైంది.

నయనతార కానీ, విఘ్నేశ్ శివన్ కానీ పిల్లల్ని కనేందుకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తప్పా వీళ్లు సరోగసీకి వెళ్లేందుకు వీలుండదు. అలా కాకుండా సరోగసీకి వెళ్లాలంటే ఎన్నో ఆరోగ్యపరమైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. వీళ్లకు నేరుగా పిల్లలు పుట్టరనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా నయనతార దంపతులు ఫాలో అయ్యారా లేదా అనేది తెలియాల్సి ఉంది. వీళ్లకు ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉండి.. పిల్లల్ని కనేందుకు ఇబ్బందులు ఉంటే అప్పుడు సరోగసీకి వెళ్లినా ఇబ్బందులు ఉండవు. అలా వెళ్లి ఉంటే.. కచ్చితంగా ఆ మేరకు వైద్యుల నిర్ధారణా పత్రాలు అవసరం.

సరోగసీ విధివిధానాలను నయనతార - విగ్నేశ్ శివన్ దంపతులు ఫాలో అయ్యారో లోదో కనుక్కునేందుకు తమిళనాడు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ వ్యవహారంపై తగిన ఆధారాలు సమర్పించాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం.. నయన్ - విగ్నేశ్ దంపతులను ఆదేశించారు. వీళ్లిచ్చే ఆధారాలను బట్టి వీరి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనే అంశాలు తేలితే తప్ప ఈ వ్యవహారానికి ముగింపు పడదు. 

 

Tags :