Radha Spaces ASBL

వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిన మైలవరం పంచాయితీ!

వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిన మైలవరం పంచాయితీ!

వైసీపీలో అంతర్గత విభేదాలు చాలా చోట్ల ఉన్నా అవి వీధికెక్కిన సందర్భాలు చాలా తక్కువ. నేతలు ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేసుకోవడం ఆ పార్టీలో తక్కువే అని చెప్పొచ్చు. అయితే పరోక్షంగా మాత్రం ఆ పార్టీ నేతలు పలు చోట్ల గీత దాటుతున్నారనే వార్తలు పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చాయి. వీటిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ హెచ్చరిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ జరుగుతోంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేశ్ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఇరువురు నేతలను పిలిచి ఆరా తీసింది వైసీపీ అధిష్టానం.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు ఇటీవల కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ కేబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని కూడా ఆయన ఖండించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను కోరాయి. దీంతో ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసి వివరణ ఇచ్చారు. తన తండ్రి మాటలతో తనకేం సంబంధం లేదని .. ఆయన మాటలను పట్టించుకోవద్దని సూచించారు. ఆయనకు నోటి దూల ఎక్కువని, పలు సందర్భాల్లో ఆయన ఇలాంటి కామెంట్స్ చేసి తలనొప్పులు తెచ్చారని సజ్జల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే సజ్జలతో భేటీ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ కామెంట్స్ మ్యాటర్ సైడైపోయింది. దానికి మించి మంత్రి జోగి రమేశ్ తో తనకున్న ఇబ్బందులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన విషయం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గంలో కొంతమంతి సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని.. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచి పోటీ చేయట్లేదని, వేరే జిల్లా నుంచి పోటీ చేస్తానని కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. తాను మైలవరం నుంచి పోటీ చేసే అవకాశం జగన్ కల్పించారని, ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఒకవేళ తనకు కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే వారికి సహకరిస్తానని చెప్పారు. తనను ఇబ్బంది పెడుతున్నవారి గురించి ఆధారాలతో సహా సజ్జలకు సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.

సజ్జల రామకృష్ణారెడ్డిని వసంత కృష్ణ ప్రసాద్ కలిసిన తర్వాత ఇవాళ మంత్రి జోగి రమేశ్ కూడా సజ్జలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనపై చేసిన ఆరోపణలపై జోగి రమేశ్ క్లారిటీ ఇచ్చారు. మైలవరం నుంచి ఈసారి జోగి రమేశ్ పోటీ చేయాలనుకుంటున్నారని.. అందుకే ఇక్కడ ఆయన అనుచరులు కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణ ప్రసాద్ .. సజ్జల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండానే కొంతమంది అధికారులను మార్చేస్తున్నారని, వారి ద్వారా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. వీటన్నిటిపైనా జోగి రమేశ్ సజ్జలకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.

జోగి రమేశ్ మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం వాసి. అందుకే ఆయన ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం మైలవరం విడిచి వెళ్లేది లేదని తేల్చి చెప్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాపై తానే పోటీ చేస్తానని ధీమాగా ఉన్నారు. మరి వీళ్లిద్దరి పంచాయితీని వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :