Radha Spaces ASBL

కర్నాటక ఎన్నికలకు మోగిన నగారా..! పార్టీల బలాబలాలేంటి..?

కర్నాటక ఎన్నికలకు మోగిన నగారా..! పార్టీల బలాబలాలేంటి..?

కర్నాటక ఎన్నికలకు నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 13న కౌంటింగ్ ఉంటుంది. కర్నాటకను తిరిగి కైవసం చేసుకోవాలని బీజేపీ, తమ నుంచి లాక్కున్న అధికారాన్ని ఈసారి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ట్రై చేస్తున్నాయి. దేశమంతా ఇప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపైనే ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్ లాంటివి.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రమంతా ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఈ మధ్య జరిగిన రాష్ట్రాల్లో పలు దఫాలుగా ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. కానీ కర్నాటకలో ఒకే దఫా ముగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. 20వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 24వ తేదీ లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 10న పోలింగ్ జరుగుతుంది. 13న కౌంటింగ్ ఉంటుంది.

దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని కమలం పార్టీ ట్రై చేస్తోంది. యడ్యూరప్పను కీలక బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఆయన ప్రభావం పార్టీపై పడింది. సీఎం పగ్గాలను బస్వరాజ్ బొమ్మైకి ఇచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. పైగా పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను అధిష్టానమే తీసుకుంది. అమిత్ షా, మోదీ.. ఈ ఎన్నికలను తమ భుజానికెత్తుకున్నారు. నెల రోజులుగా కర్నాటకపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం సాగిస్తున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోరాటపటిమ చూపిస్తోంది. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఎలాగైనా ఈసారి బీజేపీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకోవలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నేత డి.కె.శివకుమార్ అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. డీకే పైన కేసులు పెట్టి వేధించడం, ఇప్పుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం.. లాంటి అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాక.. గతంలో బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుండడం కూడా కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా కలుగజేస్తోంది.

ఇక జేడీఎస్ ఈసారి కూడా కింగ్ మేకర్ కావాలనుకుంటోంది. బీజేపీ, కాంగ్రెస్ లలో ఏ ఒక్క పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోతే తమ మద్దతు కీలకమవుతుందని భావిస్తోంది. గతంలో ఇలాగే కుమార స్వామీ సీఎం పీఠంపై కూర్చోగలిగారు. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :