MKOne Telugu Times Youtube Channel

ఎల్లుండే జగన్ రివ్యూ మీటింగ్..! ఎవరికి మూడిందోనని ఆందోళన..!

ఎల్లుండే జగన్ రివ్యూ మీటింగ్..! ఎవరికి మూడిందోనని ఆందోళన..!

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ ఎల్లుండి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే చివరి సమావేశం అని గతంలోనే జగన్ ప్రకటించారు. దీంతో ఈ సమావేశంలో జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో.. అనే ఆందోళన, ఉత్కంఠ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ఆధారంగానే నేతలకు టికెట్లు ఇస్తానని చెప్పడంతో ఈసారి తమకు ఎన్ని మార్కులు వస్తాయో.. అనే భయం కూడా కనిపిస్తోంది. అన్నిటినీ మించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని నేతలంతా వణికిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులందరినీ ప్రజల్లోకి పంపాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని 3 విడతలు నిర్వహించారు. 3 సార్లు సమీక్ష కూడా జరిగింది. ప్రతిసారీ కనీసం 30 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని తేలింది. ప్రజల్లోకి వెళ్లని నేతలకు జగన్ నేరుగా పేరు పెట్టి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే తాను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు.

ఇప్పుడు ఫైనల్ రివ్యూకు సమయం ఆసన్నమైంది. దీంతో నేతల్లో భయం కనిపిస్తోంది. ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో.. ఎవరి టికెట్ గల్లంతవుతుందో.. అని ఆందోళన చెందుతున్నారు చాలా మంది నేతలు. కొంత మంది నేతలు కనీసం ఒక్క రోజు కూడా ప్రజల గడప తొక్కలేదు. పదే పదే హెచ్చరించినా నేతల తీరు మారకపోవడంతో ఈసారి జగన్ కాస్త కఠినంగా వ్యవహరిస్తారని అందరూ భావిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది మాత్రమ సమయం ఉంది. అయినా నేతలు మేల్కోకపోవడం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.

అన్నిటికీ మించి ఇటీవల 9 జిల్లాల పరిధిలో 3 సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. దీనికి ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గతంలోనే జగన్ నేతలకు స్పష్టం చేశారు. ఎల్లుండి జరిగే సమీక్షలో దీని పైన కూడా జగన్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ నేతలు చేసిన కామెంట్స్ కూడా పార్టీలో కలకలం రేపాయి. అలాంటి నేతలను సీఎం తన నిఘా వర్గాల ద్వారు గుర్తించి ఉంటే అలాంటి వాళ్లకు కూడా క్లాసీ పీకే ఛాన్స్ ఉంది. ఇలా అన్నింటి పైనా జగన్ ఎల్లుండి సమావేశంలో సీరియస్ గానే రియాక్ట్ అవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు.

 

 

Tags :