ప్రజల్లోకి వెళ్తారా.. వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వమంటారా..? నేతలకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ప్రజల్లోకి వెళ్తారా.. వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వమంటారా..? నేతలకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక కామెంట్స్ చేశారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంపై అలసత్వం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించారు. అంతేకాక వచ్చే ఎన్నికల్లో వారసులను బరిలోకి దింపాలనుకుంటున్న నేతల ఆశలపై నీళ్లు చల్లారు. మొత్తంగా సీఎం జగన్ కామెంట్స్ పై ఎమ్మెల్యేల్లో గుబులు నెలకొంది.

గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరు తదితర అంశాలపై ఐప్యాక్ టీమ్ ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తోంది. సీఎం జగన్ కు ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తోంది. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఐప్యాక్ పై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు జగన్. అందుకే ఐప్యాక్ నివేదికలపై విశ్వాసం ఉంచి తదనుగుణంగా అడుగులు వేస్తున్నారు.

గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమంపైనా ఐప్యాక్ నివేదికలు ఇస్తోంది. ఇప్పటికే ఒక దఫా సమీక్ష నిర్వహించిన జగన్ ... తాజాగా రెండోసారి సమావేశం నిర్వహించారు. గత సమీక్షలో కొన్ని నియోజకవర్గాలకు అదనపు సమన్వయ కర్తలను నియమించడం సంచలనం కలిగించింది. అంతేకాక గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించని మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే తీరులో సాగింది సమీక్ష సమావేశం. గత సమావేశంలో లాగే ఈసారి కూడా పనిచేయని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. 27 మంది నేతలు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేదని స్పష్టం చేశారు. కనీసం 10 రోజులు కూడా ప్రజల్లోకి వెళ్లలేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచే నేతలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్. మీపైన నాకు అభిమానం ఉందని.. కానీ ఎన్నికల్లో గెలవాలంటే అది సరిపోదని తేల్చి చెప్పారు. ఎంత అభిమానం ఉన్నా గెలవలేని వాళ్లకు టికెట్లు ఇవ్వలేనని స్పష్టం చేశారు. మరోసారి అందరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నానన్న ఆయన.. అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఇకపై రోజుల వారీగానే కాకుండా గంటలవారీగా కూడా నివేదికలు తెప్పించుకుంటానని జగన్ తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలపైనే కాకుండా ప్రాంతీయ సమన్వయకర్తలపైన కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లనప్పుడు ప్రాంతీయ సమన్వయకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు. కానీ మీరు కూడా పట్టించుకోకపోతే ఎలా అని నిలదీశారు. పనిచేయలేకపోతే చెప్పండి.. వేరేవాళ్లకు బాధ్యతలను ఇస్తానని వెల్లడించారు.

మరోవైపు వారసులకు టికెట్లు దక్కించుకోవాలనున్న పలువురు నేతల ఆశలపై సీఎం జగన్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. ఈసారి వారసులకు టికెట్లు ఇవ్వలేనని స్పష్టం చేసినట్లు సమాచారం. సుమారు 15 మందికి పైగా నేతలు ఈసారి తాము తప్పుకుని వారసులను బరిలోకి దింపాలని ఆశించారు. అయితే జగన్ ప్రకటనతో ఆ ఆశ అడియాశగానే మిగిలిపోయిందని తెలుస్తోంది. మొత్తంగా జగన్ సమీక్ష సమావేశంపై నేతల్లో గుబులు మొదలైంది. వచ్చే సమీక్ష సమావేశం నాటికి ఎలాంటి నివేదికలు వెళ్తాయోననే భయం పట్టుకుంది. 

 

Tags :
ii). Please add in the header part of the home page.