జగన్‌కు ఆత్రం ఎక్కువైందా..?
రాజకీయ పార్టీల ప్రధాన ధ్యేయం అధికారమే. ఎలాగైనా ఎన్నాళ్లయినా అధికారంలో ఉండాలని పార్టీలు కలలు కంటుంటాయి. అయితే అధికారం ఎవరికి ఇవ్వాలి.. ఎవరిని దించేయాలి అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దించేసి ఎన్డీయే కూటమిని కూర్చోబెట్టారు ప్రజలు. ఇది ప్రజల తీర్పు. ఈ తీర్పును ఎవరైనా స్వాగతించాల్సిందే. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ అధికారానికి దూరమయ్యామనే బాధ నుంచి కోలుకున్నట్టు కనిపించట్లేదు. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
2019లో 153 సీట్లతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఏపీ ప్రజలు. 2024లో ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అయితే తాము ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. అయినా ఇలాంటి తీర్పు ఇస్తారని కలలో కూడా ఊహించలేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈవీఎంలలో ఏదో తేడా జరిగిందని మరికొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఇది జరిగిపోయిన వ్యవహారం. ఇంకా ఈవీఎంలపైన, ఇతరత్రా అంశాల పైన అనుమానాలు పెట్టుకుని కూర్చుంటే ఉపయోగం ఉండదు. ఓటమి నుంచి కోలుకుని కేడర్ కు భరోసా ఇవ్వాలి. అప్పుడే పార్టీ మనుగడ సాగించగలుగుతుంది.
అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇప్పటికీ తాను అధికారంలో ఉంటే ఇలా అయి ఉండేది కాదని చెప్తూ వస్తున్నారు. ఆయనే అధికారంలో ఉంటే అమ్మ ఒడి పడేది.. రైతు భరోసా వచ్చేది.. అని అనుకుంటున్నారంటూ జగన్ చెప్తున్నారు. ఆయన ఎవరితో మాట్లాడినా ఇవే మాటలు పదే పదే చెప్తున్నారు. విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేశాను. చంద్రబాబుకు అవి లేవు. హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా ఆయన హామీలు నెరవేర్చలేడు. ఇలా ఆరోపణలు గుప్పిస్తున్నారు. జగన్ మాటలు విని కొందరు నవ్వుకుంటుంటే మరికొందరు ఈయనింతే అని సెటైర్లు వేసుకుంటున్నారు.
వాస్తవానికి ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. ఎన్నికల్లో చెప్పినట్లు మొదటి నెల నుంచే పెన్షన్లు ఇస్తున్నారు. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు వేస్తున్నారు. ఒక్కో హామీని ఎలా నెరవేర్చాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అమ్మఒడి ఒకరికే ఇస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అయితే అది నిజం కాదు.. అందరికీ ఇస్తామని లోకేశ్ చెప్పారు. దీంతో వాళ్ల నోటికి తెరపడింది. ఆగస్టు15 నుంచి అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. త్వరలోనే మహిళలకు ఉచిత రవాణా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని హామీలు ఒకటి రెండు నెలల్లోనే నెరవేర్చడం ఎవరి వల్లా కాదు.
కానీ జగన్ మాత్రం చంద్రబాబు హామీలు నెరవేర్చలేదు.. విఫలమైపోయారు.. రాష్ట్రపతి పాలన పెట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోతోంది.. 36 మంది హత్యకు గురయ్యారు అని చెప్తూ వచ్చారు. ఆ 36 మంది లిస్టు ఇవ్వండి అంటే.. రిప్లై లేదు. దీంతో ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడట్లేదు. పాపం జగన్ కు మరీ తొందర ఎక్కువైపోయిందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ఈ విషయం చెప్పారు. ఎన్డీయే సర్కార్ కు కొంత సమయం ఇద్దామని.. అప్పుడే ఆరోపణలు చేయడం సరికాదని..! కానీ జగన్ మాత్రం అస్సలు ఆగట్లేదు.