చిరంజీవికి బీజేపీ గాలం వేస్తోందా..? అవార్డ్ అందుకేనా..?

చిరంజీవికి బీజేపీ గాలం వేస్తోందా..? అవార్డ్ అందుకేనా..?

చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి చాలాకాలం అయింది. ఇటీవల పలు వేదికల్లో రాజకీయాలపై మాట్లాడిన చిరంజీవి.. అవి తన మనస్తత్వానికి సరిపోవని తేల్చేశారు. అక్కడ మాటలు అనాలి.. అనిపించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తాను ఎక్కడ అడుగు పెట్టినా దాని అంతు తేల్చేవరకూ నిద్రపోనని.. అయితే రాజకీయాల్లో మాత్రం అది నిరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిరంజీవిని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని తమకోసం వాడుకునేలాగా బీజేపీ స్కెచ్ వేస్తోందనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజారాజ్యం పార్టీ పెట్టి అసెంబ్లీలో సత్తా చాటాలనుకున్న చిరంజీవికి అది నెరవేరలేదు. 18 సీట్లు మాత్రమే ప్రజారాజ్యం పార్టీ సాధించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరిపిన చిరంజీవి.. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చిరంజీవిని కేంద్ర మంత్రిని చేసి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోవడంతో చిరంజీవి కూడా సైలెంట్ అయిపోయారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ చిరంజీవి తన పార్టీ సభ్యుడే అని చెప్తున్నా... మెగాస్టార్ మాత్రం ఆ పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు.

చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ.. ఆయన చుట్టూ రాజకీయం మాత్రం నడుస్తూనే ఉందని చెప్పొచ్చు. ఆయన ఎక్కడికెళ్లినా రాజకీయాలు గురించి మాట్లాడాల్సి వస్తోంది. తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో చిరంజీవి తలచుకోకపోయినా పవన్ కల్యాణ్ రూపంలో ఆయన చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. ఇప్పుడు కూడా తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం చిరంజీవి పనిచేయబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ పట్టుదల కలిగినవాడని.. కచ్చితంగా ఏదో ఒక రోజు మంచి పొజిషన్లో చూస్తామని చిరంజీవి ఈ మధ్య వ్యాఖ్యానించారు. పవన్ నా తమ్ముడు.. సందర్భం వస్తే ఆయన కోసం పనిచేస్తానేమో అని కూడా చిరంజీవి అన్నారు.

పవన్ కల్యాణ్ బీజేపీతో కలసి పని చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ద్వారా చిరంజీవిని తమకు దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్ద నెట్ వర్క్ లేదు. ఇప్పుడు జనసేన ద్వారా కాస్తోకూస్తో బీజేపీకి లబ్ది కలగడం ఖాయం. వీరికి చిరంజీవి కూడా తోడైతే అది మరింత ఊపు తెస్తుందని బీజేపీ భావిస్తోంది. బీజేపీ - జనసేన - చిరంజీవి కలిస్తే కచ్చితంగా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలుంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే చిరంజీవిని ఏదో ఒక రూపంలో వాడుకోవాలనుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవల ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు మెగాస్టార్ చిరంజీవికి దక్కిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కూడా తనకు ఏదైనా ప్రధాన పదవి ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారనే సమాచారం కూడా అందుతోంది. మరి చిరంజీవి మదిలో ఏముందో.. బీజేపీ ఎలాంటి స్కెచ్ వేస్తోందో తెలియాలంటే వేచి చూడాలి.

 

Tags :