Radha Spaces ASBL

వంద సీట్లు ఎలా రావో చూస్తామంటున్న బీఆర్ఎస్.. సాధ్యమేనా..?

వంద సీట్లు ఎలా రావో చూస్తామంటున్న బీఆర్ఎస్.. సాధ్యమేనా..?

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకుముందు రెండు పార్టీల మధ్యే పోరు నడిచేది. కానీ ఈసారి ట్రయాంగిల్ వార్ తప్పేలా లేదు. అధికార బీఆర్ఎస్ తో కాంగ్రెస్, బీజేపీ తలపడుతున్నాయి. మూడు పార్టీలూ అధికారం తమదేనని గట్టిగా చెప్తున్నాయి. కేసీఆర్ ను ఈసారి ఎలాగైనా గద్దె దించుతామని కాంగ్రెస్, బీజేపీ ఢంకా బజాయిస్తున్నాయి. అయితే ఈసారి కూడా తమదే అధికారమని.. వంద సీట్లతో హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.

2014నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఆ పార్టీకి గుర్తింపు ఉంది. ఆ కృతజ్ఞతతో మొదటిసారి అధికారాన్ని అప్పగించారు తెలంగాణ ప్రజలు. అయితే రెండోసారి 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో తమదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నించింది. ఇప్పుడు మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే గతంలో ఉన్నంత ఈజీగా ఈసారి పరిస్థితులు ఉండవనేది విశ్లేషకుల అంచనా.

అయినా తమదే అధికారమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. వంద సీట్లు ఎలా రావో చూస్తామంటున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏప్రిల్ 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని మేనిఫెస్టో రూపొందిస్తామని.. దాని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దామని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ కీలక నేత, మంత్రి హరీశ్ రావు కూడా వంద సీట్లకు తగ్గకుండా ఈసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 114 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీ బీఆర్ఎస్ కు వంద సీట్లకు పైన ఎప్పుడూ రాలేదు. కానీ ఈసారి మాత్రం వంద సీట్లకు తగ్గవంటున్నారు.

గతంతో పోల్చితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ట్రయాంగిల్ వార్ లో తమకే లాభం చేకూరుతుందని అధికార పార్టీ అంచనా వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా ఇది వాస్తవం కూడా. రెండు పార్టీలే రేసులో ఉన్నప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మూడు పార్టీలు రేసులో ఉండడంతో మూడో పార్టీకి కాస్తోకూస్తో ప్రయోజనం కలుగుతుంది. అది కచ్చితంగా తమదేననేది బీఆర్ఎస్ నేతల అంచనా. మరి చూద్దాం వాళ్ల అంచనాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో..!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :