Radha Spaces ASBL

ఆదిపురుష్‌ను చుట్టుముడుతున్న వివాదాలు.. లోపం ఎక్కడుంది..?

ఆదిపురుష్‌ను చుట్టుముడుతున్న వివాదాలు.. లోపం ఎక్కడుంది..?

ఆదిపురుష్ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రాముడిగా ప్రభాస్ ను చూసేందుకు ఆయన అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని.. అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని భావించారు. అయితే అయోధ్యలో భారీ హంగామా మధ్య రిలీజ్ చేసిన టీజర్ అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఈ టీజర్ మరిన్ని వివాదలకు కూడా కారణమవుతోంది.

రామాయణాన్ని పక్కదోవ పట్టించేలా ఆదిపురుష్ సినిమా ఉండబోతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీసినట్లు అర్థమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. హనుమంతుడు, రావణుడి పాత్రల స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోందని మండిపడుతున్నారు. అంతేకాక ప్రభాస్ క్యారెక్టర్ పైన కూడా ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ ను ఓ రేంజ్ లో ఊహించుకున్నారు ఫ్యాన్స్. అయితే తీరా టీజర్ లో ప్రభాస్ ను చూసిన తర్వాత అది యానిమేషన్ లాగా ఉందని.. ఒరిజినల్ ప్రభాస్ కనిపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ గ్రాఫిక్స్ అత్యంత దారుణంగా ఉన్నాయంటున్నారు పలువురు సినీ ప్రేక్షకులు. అవతార్ స్థాయిలో ఉంటుందనుకుంటే చిన్నపిల్లల యానిమేటెడ్ సీరియల్ ఉన్నట్టు ఉందని నిరుత్సాహ పడుతున్నారు. ఇది కార్టూన్ సినిమానా.. ప్రభాస్ సినిమానా.. అని ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత గ్రాఫిక్స్ పై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రఖ్యాత VFX సంస్థ VFXWAALA ఈ సినిమాకు తాము గ్రాఫిక్స్ అందించలేదని ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా గ్రాఫిక్స్ కు, తమకు ఏమాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు రామాయణంలోని క్యారెక్టర్ల మేకోవర్ పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రాముడంటే ఎన్టీఆర్ గుర్తుకొచ్చేవారు. ఆ ఆహార్యం, హావభావాలు ఇప్పటికీ ప్రజలకు గుర్తుండిపోయాయి. ఇన్నాళ్లూ రాముడంటే ఇలా ఉంటాడని అందరూ భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆదిపురుష్ లో ప్రభాస్ ను చూసిన తర్వాత రాముడి క్యారెక్టర్ ను ఇలా మార్చేశారేంటి అని ఆశ్చర్యపోతున్నారు. గతంలో రాముడి క్యారెక్టర్లకు మీసాలు ఉండేవి కావు. కానీ ఇందులో మాత్రం ప్రభాస్ కు మీసాలున్నాయి.

రాముడి క్యారెక్టర్ మాత్రమే కాదు.. రావణుడు, హనుమంతుడి మేకోవర్ పైన కూడా విమర్శలు వస్తున్నాయి. అతని క్యారెక్టర్ ముస్లింను పోలినట్లు ఉందంటున్నారు. ఇక హనుమంతుడికి గడ్డం ఉంది కానీ మీసాలు లేవు. హిందువులెవరూ మీసాలు లేకుండా గడ్డాలు పెంచరు. అంతేకాదు.. వానరసేన గ్రాఫిక్స్ కూడా కోతులను కాకుండా చింపాజీలను పోలినట్లు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. టీజర్ చూసిన తర్వాత రామాయణానికి కొత్త భాష్యం చెప్పేందుకు ఓంరౌత్ ప్రయత్నిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :