Radha Spaces ASBL

ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు

ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు

ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ నగరం ఇప్పుడు మరో ఆధ్యాత్మిక కేంద్రానికి కూడా నిలయంగా మారనున్నది. హైదరాబాద్‌ శివారులో ఉన్న ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమవుతోంది. భారీ రామానుజుడి విగ్రహం.. మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాలు, సంభ్రమాశ్చర్యాలను కలిగించే సాంకేతిక విన్యాసాలు అబ్బురపరిచే రాతి శిల్పాలతో శ్రీరామానుజ సహస్రాబ్ధి ప్రాంగణం వేడుకలకు రెడీ అయింది. హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌ శ్రీరామనగరంలో నిర్మించిన ఈ మహా ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలా 2 నుంచి 14 వరకు ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’పేరిట ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, పలు రంగాల ప్రముఖులు అందులో పాల్గొననున్నారు. 216 అడుగుల ఎత్తయిన రామానుజుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని ప్రారంభించనుండగా.. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల రామానుజుల నిత్యపూజామూర్తిని 13న రాష్ట్రప్రతి తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖరరావు ఈ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.

ఉత్సవాలు నిర్వహించే రోజులలో భారీఎత్తున హోమాలు జరగనున్నాయి. సమతామూర్తి విగ్రహానికి సమీపంలోనే దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోమాలకోసం ఏర్పాట్లు చేశారు. 35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు విచ్చేసి క్రతువులో పాల్గొంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి.  144 యాగశాలలతోపాటు ప్రధాన యాగశాల నిర్మించారు. నాలుగు విదిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు జరుగుతాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టిశాలలు. వీటన్నింటిలో 1,035 హోమకుండాలు నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపించనున్నారు. ప్రతి హోమకుండంలో ఒకపూటకు నాలుగు కిలోల నెయ్యి వినియోగిస్తారు. అలా రోజుకు ఒక్కో యాగశాలలో 9 హోమకుండాలకు 72 కిలోల నెయ్యి  అవసరం. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో దేశీయ ఆవు పాల నుంచి సేకరించిన 2 లక్షల కిలోల స్వచ్ఛమైన నెయ్యిని వినియోగించనున్నారు. 

ఏర్పాట్లపై సమీక్షించిన కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి

యాదాద్రి ఆలయ పున:ప్రారంభంపై, ఫిబ్రవరిలో జరిగే సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామితో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు చర్చించారు. ఇటీవల ఆయన ముచ్చింతల్‌లోని చినజీయర్‌ ఆశ్రమాన్ని సందర్శించారు. మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శనయాగం ఏర్పాట్లు, ఆహ్వానాలతోపాటు, ఫిబ్రవరిలో జరిగే సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం పనులనూ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నిశాఖలు సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చినజీయర్‌ స్వామితో కలిసి యాగశాలలను సందర్శించారు.  ఏర్పాట్లపై సమీక్షిస్తూ, విద్యుత్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి యాగం సమయంలో నిరంతరాయంగా పవర్‌ సప్లై చేయాలని ఆదేశించారు. మిషన్‌ భగరీథ నీరు అందించాలని సూచించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. యాగశాల వద్ద ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు, యాగానికి వచ్చే వీఐపీల కోసం వసతి, రోడ్డు సౌకర్యం వంటి అంశాలపై సూచనలు చేశారు. సమతామూర్తి విగ్రహాన్ని కూడా కేసీఆర్‌ పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, మైం హోం గ్రూప్స్‌ అధినేత రామేశ్వరరావు ఉన్నారు.

ప్రత్యేకతలను చాటుకున్న రామానుజుల విగ్రహం

ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అతి ఎత్తయిన లోహ విగ్రహంగా శ్రీరామానుజుల విగ్రహం నిలవనుంది. ఇందులో పద్మాసనంలో ఉన్న రామానుజుల విగ్రహం 108 అడుగులుండగా.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. స్వామివారి పాదుకలతో ఉండే శఠారి 18 అడుగులు ఉంది. ఈ లోహ విగ్రహం బరువు 1,800 టన్నులు. దీన్ని చైనాకు చెందిన ఏరోసన్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో.. చినజీయర్‌ స్వామి సూచనల ప్రకారం రూపొందించారు. 200 మంది చైనా నిపుణులు 9 నెలల పాటు శ్రమించి.. 1,600 భాగాలుగా విగ్రహాన్ని తయారు (క్యాస్టింగ్‌)ఈ చేశారు. వాటిని ఇండియాకు తీసుకొచ్చాక 60మంది చైనా నిపుణులు కలిపి తుదిరూపు ఇచ్చారు. వాతావరణంలో ఏర్పడే మార్పులు, పరిణామాలను తట్టుకుని వెయ్యేళ్లు నిలిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

రామానుజుల మహా విగ్రహం చుట్టూ.. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్‌, ముక్తినాథ్‌, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా ప్రధాన వైష్ణవాలయాలు ఇందులో ఉన్నాయి. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్‌ ఫౌంటెయిన్‌ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతిలో ఉండే ఈ ఫౌంటెయిన్‌లో పద్మపత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఎనిమిది రకాల జీవరాశులు నీటిని విరజిమ్ముతుండగా.. పద్మపత్రాల మధ్య నుంచి రామానుజుల ఆకృతిపైకి వచ్చి అభిషేకం జరుగుతున్న భావన కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తుంటాయి.

ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహ ప్రారంభ కార్యక్రమాలను చూసేందుకు ఇప్పటికే ఎంతోమంది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :