ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

శ్రీసిటీని సందర్శించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి

శ్రీసిటీని సందర్శించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి

- మంత్రిచే రెండు పరిశ్రమలకు ప్రారంభోత్సవం, ఆరు పరిశ్రమలకు ఎంఓయు  
- సిఐఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రసంగం   
- శ్రీసిటీలో నైపుణ్యాభివృద్ధి, సామాజిక ఆర్థిక సర్వే నివేదికల విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, మౌళిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం, సమాచార సాంకేతికత, చేనేత & జౌళి శాఖామాత్యులు గుడివాడ అమర్‌నాథ్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, ఇక్కడ ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, మెగా ఇండస్ట్రియల్ హబ్ చురుకైన అభివృద్ధిపై వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. మంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కె.ఆదిమూలం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కె.సంజీవయ్య, ఏపిఐఐసి వైస్ చైర్మన్ & ఎండీ, పరిశ్రమల కమిషనర్ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు లంకా శ్రీధర్, ఇతర పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పర్యటనలో భాగంగా శ్రీసిటీలో నూతనంగా ఏర్పాటైన ఆర్‌ఎస్‌బి ట్రాన్స్‌మిషన్, అడెలా ఎలక్ట్రికల్స్‌ పరిశ్రమలను మంత్రి ప్రారంభించారు. దీంతో పాటు NGC, టిల్ హెల్త్‌కేర్ (విస్తరణ), మాగ్నమ్, ఎవర్‌షైన్ మౌల్డర్స్, బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్, BVK గ్రూప్ అనే ఆరు నూతన కంపెనీల స్థాపనకు మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ కంపెనీల మొత్తం పెట్టుబడి విలువ దాదాపు రూ.500 కోట్లు కాగా, 1500 మందికి ఉపాధి లభిస్తుంది.

అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య (CII) రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మంత్రి అమర్‌నాథ్ పాల్గొన్నారు. ఇందులో తిరుపతి ప్రాంతానికి చెందిన సిఐఐ సభ్యులు, శ్రీసిటీలోని పలు పరిశ్రమల సీఈఓలు మరియు శ్రీసిటీ పరిసర ప్రాంతాలలోని మరికొందరు పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. పరస్పర చర్చల ద్వారా పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య మంచి అవగాహన పెంపొందించడం ఈ సమావేశ ఉద్దేశ్యమని సిఐఐ తిరుపతి రీజియన్ చైర్‌పర్సన్ శ్రీమతి ప్రియమంజరి టోడి తన ప్రసంగంలో వివరించారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సిఐఐ సభ్యులు, పరిశ్రమల ప్రతినిధులను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధితో పాటు వెనుకబడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీసిటీ యాజమాన్యం తీసుకున్న చొరవను అభినందించారు. అద్భుతమైన మౌళిక సదుపాయాలు, పెట్టుబడిదారుల అనుకూల వాతావరణం కలిగిన శ్రీసిటీ పారిశ్రామిక హబ్‌ పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, దీనికి కృషి చేసిన డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డిని ప్రశంసించారు.

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డైనమిక్ నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానంతో సమగ్ర సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధన, స్టార్టప్ లను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి పెంపు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. కొత్త విధానంలో ప్రాజెక్ట్‌ల వేగవంతమైన క్లియరెన్స్‌కు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన లాజిస్టిక్ మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. సిఐఐ సభ్యుల అభిప్రాయాలను తీసుకుని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న రోజు, మంత్రి మొట్టమొదటిగా శ్రీసిటీ పర్యటనకు రావడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. ఈ పర్యటన ద్వారా పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వ శ్రద్ద, ప్రాధాన్యత ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆయన పరిశీలనలు, సూచనలు శ్రీసిటీ అభివృద్ధికి మరింత ప్రయోజనం చేకూరుస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాలో వ్యాపార, పరిశ్రమల అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంలో ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అమూల్యమైన మార్గదర్శకత్వం, సహాయ సహకారాలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత మూలంగా పెట్టుబడులను ఆకర్షించడంలో, పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించడంలో, ఈ ప్రాంత ఆర్థిక వృద్ధి పెంపులో కీలకంగా మారిందని అభిప్రాయం వెలిబుచ్చారు. పరిశ్రమలు అనేక ప్రయోజనాలను పొందేందుకు సిఐఐలో సభ్యత్వం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

పరస్పర చర్చా కార్యక్రమంలో, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (IALA)లో ఆస్తిపన్ను రాయితీ, సెజ్ యూనిట్లు ఎదుర్కొంటున్న GST, కస్టమ్స్ సుంకం సంబంధిత సమస్యలు, ముడిసరుకు దిగుమతులకు సంబంధించిన ఇబ్బందులు, విద్యుత్ సబ్సిడీలు మరియు అంతరాయాలు, రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తికి ఆమోదాలు, ఈ ప్రాంతంలోని పారిశ్రామిక పార్కులలో రోడ్లు మరియు ఇతర సౌకర్యాల మెరుగుదల, నైపుణ్యం అభివృద్ధి, ఐటిఐ మరియు పాలిటెక్నిక్ కోర్సులలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం తదితర పలు అంశాలను మంత్రి ఎదుట ప్రస్తావించారు. అన్నింటినీ పరిశీలించి, తగు పరిష్కారాలు చేపడతామంటూ మంత్రి సమాధానమిచ్చారు. 

సమావేశం చివరలో, 'పరిసర గ్రామీణ ప్రాంతాలపై శ్రీసిటీ ఇండస్ట్రియల్ పార్క్ సామాజిక ఆర్థిక ప్రభావం' అనే అంశంపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారి సర్వే నివేదిక, మరియు శ్రీసిటీలో 'స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ ఇనిషియేటివ్స్' అంశంపై రూరల్ మీడియా సంస్థ వారి కేస్ స్టడీ నివేదికను మంత్రి లాంఛనంగా విడుదల చేశారు.  

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :