Kadambari Jethwani: జెత్వానీ కేసు మరో మలుపు తీసుకోబోతోందా..!?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పడు అత్యంత ఆసక్తి కలిగిస్తున్న అంశాల్లో కాదంబరీ జెత్వానీ కేసు (Kadambari Jethwani Case) ఒకటి. ముంబై నటి, మోడల్ కాదంబరీ జెత్వానీని గత ప్రభుత్వంలో కొంతమంది ఐపీఎస్ (IPS ) లు వేధించి తప్పుడు కేసులు (Police Case) పెట్టారనేది ఆరోపణ. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై మరింత లోతైన విచారణ (Enquiry) అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఈ కేసును సీబీసీఐడీకి (CBCID) బదిలీ చేసే ఆలోచనలో ఉంది. నేడో రేపో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష (Review) నిర్వహించారు. ఇటీవల నమోదైన ప్రముఖ కేసుల పురోగతిపై ఆరా తీశారు. ఇందులో కాదంబరీ జెత్వానీ కేసు కూడా ఉంది. ఈ కేసులో వైసీపీ నేతలు (YSRCP Leaders), ఐపీఎస్ అదికారులు ఉండడంతో ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇది రాష్ట్రం దాటి ముంబై (Mumbai) వరకూ విస్తరించిన వ్యవహారం కాబట్టి దీన్ని సీఐడీకి (CID) అప్పగిస్తే బాగుంటుందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో న్యాయనిపుణుల అభిప్రాయ తీసుకుని ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidya Sagar) ముంబైకి చెందిన కాదంబరీ జెత్వానీపై ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) కేసు పెట్టారు. తన ఆస్తిని అక్రమంగా అమ్మేందుకు ఆమె ప్రయత్నించిందనేది ఆ కేసు సారాంశం. అయితే ఈ కేసు నమోదు కాకముందే ఐపీఎస్ అధికారులు టికెట్లు బుక్ చేయడం.. తర్వాత ముంబై వెళ్లడం.. జెత్వానీ కుటుంబాన్ని (Jethwani Family) ఇక్కడకు తీసుకురావడం.. 40 రోజులపాటు ఇక్కడే వేధించడం లాంటివి జరిగాయి. ఆమె ఫోన్ పాస్ వర్డ్ (password) కోసం ఆమె సన్నిహితుడైన అతుల్ సింగ్ (Atul Singh) అనే వ్యక్తిపై వ్యభిచారం కేసు కూడా పెట్టినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
గత ప్రభుత్వంలో కొంతమంది ప్రముఖులు, అధికారులు తనను అక్రమంగా నిర్బంధించి వేధించారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాదంబరీ జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె పెట్టిన కంప్లెయింట్ (complaint) మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ కేసు రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ముంబై, నోయిడా (noida) లాంటి ప్రదేశాలతో కూడా సంబంధాలున్నాయి. అలాంటప్పుడు కేసును సీఐడీకి బదలాయిస్తే మంచిదని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.