SIT : సిట్‌కు బ్రేక్..! చంద్రబాబు సర్కార్ వెనక్కు తగ్గుతోందా..!?
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం సుప్రీంకోర్టులో ఈ అంశంపై వాడివేడి వాదనలు జరిగాయి. కల్తీ నెయ్యిపై (adulterated ghee) సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme court bench) కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ నెయ్యిపై ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. ఈ అంశంపై బాధ్యతాయుత పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి (AP CM) లాంటి వ్యక్తి ప్రెస్ తో ఎలా మాట్లాడతారని నిలదీసింది. ఈ అంశంపై రాజకీయం చేయడం తగదన్న సుప్రీం ధర్మాసనం.. సిట్ సరిపోతుందా.. లేకుంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా.. అని సొలిసిటర్ జనరల్ (Solicitor General) అభిప్రాయాన్ని కోరింది. తదుపరి విచారణను ఈనెల 3కు వాయిదా వేసింది.
లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడంతో ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్ (SIT) మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. పైగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిట్ సరిపోతుందా.. లేకుంటే మరో సంస్థతో విచారణ జరిపించాలా అనే దానిపై సమాధానం చెప్పేందుకు 3వ తేదీ వరకూ కేంద్రానికి గడువిచ్చింది సుప్రీం ధర్మాసనం. దీంతో సిట్ తాత్కాలికంగా తన దర్యాప్తును నిలిపివేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు (DGP Dwaraka Tirumala Rao) స్వయంగా వెల్లడించారు.
తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడకంపై నాలుగు రోజులుగా సిట్ దర్యాప్తు చేస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ట త్రిపాఠి (IPS Sarvasreshta Tripati) ఈ సిట్ కు నేతృత్వం వహిస్తున్నారు. నాలుగు రోజులుగా తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో సిట్ బృందం విచారణ చేపట్టింది. ఇవాళ ఉదయం వరకూ కూడా సిట్ తమ పని కొనసాగించింది. అయితే ఇవాళ డీజీపీ ద్వారకా తిరుమల రావు తిరుమలేశుడ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిట్ బృందం ఆయన్ను కలిసింది. ఈ వ్యవహారం సుప్రీం పరిధిలో ఉన్నందున తాత్కాలికంగా సిట్ విచారణను ఆపితే మేలనే అభిప్రాయానికి వచ్చారు.
అయితే సిట్ విచారణ నిలిపివేత వెనుక మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న విచారణ సందర్భంగా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా సిట్ తన పని తాను చేసుకుపోతే సుప్రీం మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తుందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే సుప్రీం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకూ తాత్కాలికంగా సిట్ వ్యవహారాలను ఆపితే బాగుంటుందని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 3వ తేదీ కేంద్ర ప్రభుత్వం (Central Govt) చెప్పే నిర్ణయంతో పాటు దానికి సుప్రీంకోర్టు ఇచ్చే రిప్లైని బట్టి సిట్ మనుగడ ఆధారపడి ఉంటుంది.