తమ జీవితంలో ఇలాంటి జీవోను ... ఎప్పుడూ చూడలేదు
ఒక ప్రాంతం గుత్తేదారులకు మాత్రమే బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వమే జీవో విడుదల చేయడం దారుణమని, తమ జీవితంలో ఇలాంటి జీవోను ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ గుత్తేదారుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల, డోన్‌లో వాళ్లు మాత్రమే గుత్తేదారులా? తాము కాదా? అని ప్రశ్నించారు. తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాలుగా అడుగుతున్నా పట్టించుకోకుండా పులివెందుల, డోన్‌లో గుత్తేదారులకు మాత్రమే బిల్లులు ఇవ్వడం ముఖ్యమంత్రి పక్షపాతం చూసినట్లు కదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి అందరినీ సమానంగా చూడాలని, ఇలా పక్షపాతంగా పాలన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిగిలిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.