ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మరోసారి హిందీ స్లోగన్స్‌తో ట్రంప్.. మధ్యంతర ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మరోసారి హిందీ స్లోగన్స్‌తో ట్రంప్.. మధ్యంతర ఎన్నికల్లో విజయమే లక్ష్యం

అగ్రరాజ్యం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నవంబరు నెలలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న భారతీయ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి హిందీ స్లోగన్స్‌తో ప్రజల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రంప్ తన హిందీ స్లోగన్‌ను ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. ‘భారత్ అండ్ అమెరికా సబ్‌సే అచ్ఛే దోస్త్’ అనే స్లోగన్‌తో రిపబ్లికన్ పార్టీ ఈ మధ్యంతర ఎన్నికలకు వెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. అంతకుముందు 2016లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన సమయంలో ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ వంటి స్లోగన్స్ ఉపయోగించారు. రిపబ్లికన్ హిందూ కోఅలేషన్ (ఆర్‌హెచ్‌సీ)కు చెందిన శలభ్ కుమార్ ఈ స్లోగన్స్‌ను తీసుకొచ్చారు. అయితే 2020లో ట్రంప్‌తో విభేదాలు రావడంతో ఆర్‌హెచ్‌సీ పక్కకు తప్పుకుంది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇటీవల ట్రంప్ లగ్జరీ విల్లా ‘మార్ ఎ లాగో’లో ఆయన్ను కలిసిన శలభ్ కుమార్.. మరోసారి ట్రంప్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ‘భారత్ అండ్ అమెరికా సబ్‌సే అచ్ఛే దోస్త్’ స్లోగన్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. నవంబరులో పెన్సిల్వేనియా, ఒహాయో, విస్కాన్సిన్, అరిజోనా, జార్జియా స్టేట్స్‌లో మధ్యంతరర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలోనూ కొద్దోగొప్పో భారతీయ కమ్యూనిటీ ఉంది. వీరిని ఆకర్షించేందుకే ట్రంప్ మరోసారి హిందీ స్లోగన్స్‌ను నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఎలాగైనా సరే ఐదుగురు రిపబ్లికన్‌లను హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు పంపాలనేదే ఆ పార్టీ ఆలోచన. ఇక్కడ రిపబ్లికన్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని, వీటిలో కొన్ని ప్రాంతాల్లో విజేతల మార్జిన్ 5 వేల కన్నా తక్కువ ఓట్లేనని శలభ్ కుమార్ చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న హిందూ కమ్యూనిటీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉందని వివరించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :