తెలంగాణలో ఇప్పటికే ఎక్కువ అయింది.. ఇంకా సహించేది లేదు

ప్రధాని మోదీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని నటి, బీజేపీ నేత ఖుష్బు విమర్శించారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఖుష్బు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం బీజేపీకి పెద్ద కష్టమైన పని కాదన్నారు. ఎక్కడైనా పోటీ అనేది ఉండాలి. మాకు సరైన పోటీ ఉండాలనే మేం భావిస్తున్నాం. పోటీ లేకపోతే ఎలాంటి ఆసక్తి ఉండదు. మోదీజీ వెనక్కి పోవాలని హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టారు. అవన్నీ చూస్తుంటే టీఆర్‌ఎస్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. మూడోసారి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లలేదు. కేసీఆర్ ఆలోచనా విధానం ఎలా ఉందనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందన్నారు.
దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు బీజేపీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అవన్నీ ప్రజలకు దగ్గరయ్యాయి. దేశంలో ఎక్కడా వారసత్వ పాలన ఉండకూడదు. ఇప్పటికే ఎక్కువ అయింది. ఇంకా వారసత్వ రాజకీయాలను సహించేది లేదు. దేశం ముందుకు వెళ్లాలి కదా. బీజేపీ విషయంలో ప్రజలు సంతోషంగా లేకపోతే 2019 ఎన్నికల్లో ప్రజలు గెలిపించేవారు కాదు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అది ప్రజలు చూస్తారు అని అన్నారు.






