రివ్యూ: 'ఆయ్' సినిమా చూస్తే మనసుకు హాయి!
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : GA2 పిక్చర్స్,
నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక, వినోద్ కుమార్, మైమ్ మధు, కసిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయా తదితరులు
సినిమాటోగ్రఫీ : సమీర్ కళ్యాణి, సంగీతం : రామ్ మిర్యాల,
ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ కుమార్ మన్నె,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అజయ్ గద్దె,
సహ నిర్మాతలు : భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సమర్పణ : అల్లు అరవింద్, నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి,
కథ, దర్శకత్వం : అంజి కె.మణిపుత్ర,
విడుదల తేదీ : 15.08.2024
నిన్న ఆగస్ట్ 15న థియేటర్స్ దంగల్ లో మూడు భారీ చిత్రాలు రెండు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి అయితే ఇక్కడ ఎన్ని చిత్రాలు పాస్ అయ్యాయో ఇప్పటికే సినీ ప్రేక్షకుడు తీర్పు ఇచ్చేసాడు. మిస్టర్ బచ్చన్, డబల్ ఇస్మార్ట్, తంగలాన్ మూవీస్ కి బీలో అవేరేజ్ గా మార్కులు పడ్డాయి. ఇదే రోజు మీకు పోటీగా నేనున్నాను అంటూ ధైర్యంగా 'ఆయ్' చిత్రం కూడా విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు చూస్తే ఇది లైట్ హార్టెడ్ మూవీ అని అర్థం అవుతుంది. నార్నే నితిన్, నయన్ సారిక కాంబోలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించిన చిత్రం ఆయ్. నితిన్‌తో పాటుగా అంకిత్ కొయ్య, కసిరాజు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో? భారీ చిత్రాల విడుదల నడుమ ప్రేక్షకులను 'ఆయ్' అంటూ పలకరిస్తే... వారు ఒకే అన్నారా లేదా ఓ సారి సమీక్షలో చూద్దాం.
కథ
బూరయ్య (వినోద్ కుమార్) కొడుకు కార్తీక్ (నార్నే నితిన్) కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోం అంటూ తన సొంతూరు అమలాపురానికి వచ్చేస్తాడు. ఊర్లో అందరికీ సాయం చేసి ఉన్నదంతా పోగొట్టేశాడని కోపంతో ఉంటాడు కార్తీక్, తన తండ్రి అంటే అంతగా ఇష్టం ఉండదు. బూరయ్య ఊర్లోకి రాకుండా, ఇంటి గడప దాటకుండా లోపలే ఉండిపోతాడు. ఇక కార్తీక్‌కి ఊర్లో బాల్య స్నేహితులు హరి (అంకిత్ కొయ్య), సుబ్బు (కసిరాజు). కార్తీక్ రావడంతో ఆ ఇద్దరూ తెగ సంబరపడుతుంటారు. కానీ కార్తీక్ మాత్రం తన ఫ్రెండ్స్ నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. ఊర్లో పల్లవి (నయన్ సారిక)ను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు కార్తీక్. కానీ స్నేహితుడు సుబ్బు అదే అమ్మాయిని ఐదేళ్లుగా వన్ సైడ్ ప్రేమిస్తాడు. పల్లవి మాత్రం కార్తీక్‌ను ఇష్టపడుతుంది. ప్రాణం కంటే కులమే ఎక్కువగా భావించే దుర్గ (మైమ్ మధు) తన కూతురుకి సొంత కులం అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కులం వేరు అనే కారణంతో తన తండ్రి దుర్గ చూపిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు పల్లవి సిద్దపడుతుంది. అయితే పారిపోయి పెళ్లి చేసుకోవడానికి కార్తీక్, అతడి ఇద్దరు ఫ్రెండ్స్ హరి, సుబ్బు చేసిన ప్రపోజల్‌ను పల్లవి తిరస్కరిస్తుంది. కులం కారణంగా ప్రేమ వర్కౌట్ కాదని కార్తీక్‌ను పల్లవి దూరం పెడుతుంది. కులం, స్థాయి కారణంగా ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని కార్తీక్ బాధపడతాడు. కూతురు వేరే కులం అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసిన తర్వాత దుర్గ రియాక్షన్ ఏమిటి? పెళ్లి పీటల మీద పల్లవి కూర్చొని ఉండగా ఆ పెళ్లిని ఆపాలని కార్తీక్ తండ్రి చేసిన ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? కార్తీక్ తండ్రి కోరికను దుర్గ మన్నించాడా? కార్తీక్, పల్లవి ప్రేమ వికసించి పెళ్లిగా మారిందా? అసలు బూరయ్య ఫ్లాష్ బ్యాక్ ఏంటి? బూరయ్యకు, దుర్గకు ఉన్న రిలేషన్ ఏంటి? చివరకు కార్తీక్ కథకు ఎలా ఎండ్ కార్డ్ పడింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఆయ్ సినిమా కథ.
నటీనటుల హావభావాలు :
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా స్టార్లు లేరు.. భారీగా రెమ్యునరేషన్లు తీసుకొనే ఆర్టిస్టులు కనిపించరు. లోకల్ ఫ్లేవర్‌ను బలంగా చిన్న చిన్న నటీనటులతో దర్శకుడు సినిమాను రూపొందించిన విధానమే ప్లస్ పాయింట్. నార్నే నితిన్, నయన్ సారిక కథకు ఫేస్ అయితే.. కసిరెడ్డి, అంకిత్ కోయా ఈ మూవీకి బ్యాక్ బోన్‌గా మారారు. ఈ సినిమాకు కసిరెడ్డి రాజ్ కుమార్ హీరో అని చెప్పినా ఎలాంటి సందేహం అక్కర్లేదు. మొదటి సినిమా కంటే నితిన్ మెరుగ్గా నటించాడు. ఇక మైమ్ మధు గంభీరమైన పాత్రతో ఫెర్ఫార్మెన్స్ చూపించడమే కాకుండా ఎమోషనల్ కంటెంట్‌తో కంటతడి పెట్టించాడని చెప్పాలి. ఇక సీనియర్ హీరో వినోద్ కుమార్ తండ్రిగా చివరి 20 నిమిషాలు తన నటనతో మూవీని మరో మెట్టు ఎక్కించాడు. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారందరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు :
ఆయ్ కథ కొత్తదేమీ కాదు. కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్త వుంది. కథను చాలా సింపుల్‌గానూ, ఆసక్తికరంగానూ చెప్పే దర్శకులుంటారు. అనవసరపు బిల్డప్పులు, అనవసరపు ఖర్చులు పెట్టించే దర్శకులు కూడా ఉంటారు. కానీ ఆయ్ దర్శకుడు మాత్రం మొదటి రకానికి చెందిన వాడనిపిస్తుంది. మనం ఎన్నో సార్లు చూసిన కథను, చాలా సింపుల్ కథను.. ఎంతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మలిచాడు. ఆ విషయంలో అంజి కె.మణిపుత్రకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఏ ప్రేమ కథలైనా కులం, మతం, ధనిక, పేద స్థాయి అడ్డుగా ఉంటాయి. కానీ గోదావరి జిల్లాల్లో కులానికి ఇచ్చే ప్రాధాన్యతను చాలా ఫన్నీగా చెప్పాడు. ఈ ఆయ్‌లోనూ ఈ కులం గురించే ఉంటుంది. అలా అని ఆ టాపిక్‌ను సీరియస్‌గా ఏమీ హ్యాండిల్ చేయలేదు. ఎంతో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. విజువల్స్ చూస్తుంటే నిజంగానే మనం గోదావరి జిల్లాల్లో ఉన్నామా? అని అనిపిస్తుంది. లవ్, ఫ్యామిలీ, యూత్ ఫుల్ కంటెంట్‌తో ఉన్న సన్నివేశాలకు సమీర్ కల్యాణి సినిమాటోగ్రఫి ప్రాణం పోసింది. రామ్ మిర్యాల సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.ఇక కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ మరో ప్లస్ పాయింట్. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భన్నీ వాసు, విద్యా కోప్పినీడి అనుసరించిన నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి.అల్లు అరవింద్ పర్యవేక్షణ సినిమాకు మరింత బలంగా కనిపించింది.
విశ్లేషణ :
కులం, ప్రేమ కంటే ఫ్రెండ్‌ఫిప్ మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదనే సందేశంతో రూపొందిన చిత్రం ఆయ్. కథ, కథనం, ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు 20 ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురి చేయడం ఈ సినిమా సక్సెస్ అని చెప్పడానికి దోహదపడ్డాయి. థియేటర్‌లో ఈ వారం అర్జెంటుగా ఏదైనా సినిమా చూసేయాలంటే.. ఆయ్ చిత్రం చూడొచ్చు. సినిమా చూస్తే మనసుకు హాయి మాత్రం కలుగుతుంది. లవ్,యూత్, కామెడీ, ఫ్యామీలి ఎమోషన్స్ అన్ని కలబోసిన ఈ చిత్రం అన్ని తరగతుల వారు సకుటుంబం తోపాటు వెళ్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు.