కేంద్రం వర్సెస్ విపక్షాలు..
దేశంలో అభివృద్ధి సైతం రాజకీయాంశంగా మారుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశం..దీన్ని మరోసారి రుజువు చేసింది. ఈ సమావేశానికి విపక్ష పార్టీలకు చెందిన 9 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు డుమ్మాకొట్టారు. తాము ఈ సమావేశానికి హాజరయ్యేది లేదంటూ ముందే స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సమావేశమంటే.. దేశాభివృద్ధి దిశగా తీసుకోనున్న చర్యలపై చర్చించి, వాటి అమలును సమీక్షించడం. మరి దీన్ని సైతం ఈ సీఎంలు ఎందుకు పట్టించుకోవడం లేదు. అంటే రాజకీయ ప్రతీకారం అన్నది .. అభివృద్ధిపైనా ప్రభావం చూపిస్తోంది అని అర్థం చేసుకోవచ్చు.
ఓ వైపు ప్రధాని మోదీ .. దేశవ్యాప్తంగా కమల వికాసం జరిగేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధాని పర్యటనలు కొన్నిచోట్ల రాజకీయ సభల్లా మారుతున్నాయి. నేరుగా విపక్ష పార్టీల నేతలపైకి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో వారు సైతం ప్రధానిని .. ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. ఫలితంగానే ఇలాంటి కీలక సమావేశాలకు సైతం డుమ్మా కొట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే .. ఏయే రాష్ట్రాల సీఎంలు అయితే.. ఈసమావేశానికి డుమ్మకొట్టారో.. ఆయా రాష్ట్రాలకు కావాల్సిన అభివృద్ధి చర్యలపై చర్చించే అవకాశం కోల్పోయారని నీతిఆయోగ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశానికి సీఎంలు హాజరుకాకపోవడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది..సీఎంల చర్య బాధ్యతారాహిత్యం, ప్రజావ్యతిరేకమైందిగా బీజేపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.దాదాపు వందకు పైగా కీలకాంశాలు, సంక్షేమ పథకాల అమలుపై నీతిఆయోగ్ సమావేశం చర్చించినట్లు తెలిపారు. ఆపథకాలను రాష్ట్రాల్లో అమలు చేసే విషయంపై వారి అభిప్రాయాల్ని చెప్పి, తగు చర్యలు తీసుకునే అవకాశం కోల్పోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
విపక్షాలు మాత్రం .. తమ వాదనను కొనసాగిస్తున్నాయి. విపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం శీతకన్నేసిందని ఆరోపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి పథకాలకు సరైన సహకారం అందించడం లేదని విమర్శిస్తున్నాయి. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు, అందులోనూ గుజరాత్ కే అధిక నిధులు కేటాయిస్తున్నారని బహిరంగంగా ఆరోపిస్తున్నాయి. ఇలాంటప్పుడు సమావేశానికి హాజరుకాకున్నా వచ్చే సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అంటే కేంద్రం వర్సెస్ విపక్షాల వ్యవహారం మరింత తీవ్రతరమైన సూచనలు కనిపిస్తున్నాయి.