ప్రపంచ తెలుగు మహాసభల ముగింపుతో బాధ్యత మరింత పెరిగిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఐదు రోజుల పండుగ అద్భుతం చూడంగా, తెలుగు భాషామతల్లికి తెలంగాణ ప్రణమిల్లె. అందుకొనుడు నా అభినందనమాల. మాతృభాష పరిరక్షణ, వికాసం కుటుంబం నుంచే మొదలవ్వాలి. అందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తెలుగు భాష తీయధనం, తెలుగుజాతి గొప్పదనం తెలుసుకున్నవారికి, తెలుగే ఒక మూలధనం. ప్రతి తల్లీ తండ్రికి ఒక విన్నపం చేస్తున్నా. మీ పిల్లల పుట్టినరోజు తదితర ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా, ఓ మంచి తెలుగు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఏ భాషా సంస్కృతి బాగా వృద్ధి చెందాలన్నా ప్రసార మాధ్యమాలు ముఖ్యపాత్ర పోషించాలి అని అన్నారు. చేయెత్తి జెకొట్టు తెలుగోడా ఘతమెంతో ఘనకీర్తి గలవోడా అంటూ గవర్నర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.