
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల అమెరికన్లలో అసంతృప్తి వ్వక్తమవుతోంది. దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించాల్సిన ట్రంప్ విభజించేలా వ్యవహరిస్తున్నారని 56శాతం అమెరికన్లు మండిపడ్డారు. డెమొక్రాట్లలో 93శాతం ఇలా చెబుతుంటే రిపబ్లికను మాత్రం ట్రంప్ ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నారని 15శాతం మందే అభిప్రాయపడ్డారు. ఇక మొత్తం మీద పోల్‌లో పాల్గొన్న వారిలో 33శాతం ఓటర్లు ట్రంప్ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు. ఉత్తర కొరియా విధానం, రష్యా, పర్యావరణం, హెల్త్‌కేర్, వర్ణ వివక్ష వంటి పలు అంశాల్లో ట్రంప్ పాలనకు నెగిటివ్ రేటింగ్‌లు వస్తున్న క్రమంలో తాజాగా ఫాక్స్ న్యూస్ పోల్ సైతం ట్రంప్‌కు షాక్ ఇచ్చింది. పోల్‌లో ప్రస్తావించిన కీలక అంశాల్లో ఏ ఒక్క అంశాన్నీ ట్రంప్ సమర్థంగా డీల్ చేస్తున్నారని ఓటర్లు చెప్పకపోవడం గమనార్హం. అయితే ఆర్థిక అంశాలు మాత్రం ట్రంప్ హయాంలో మెరుగయ్యాయని 36శాతం మంది అభిప్రాయపడ్డారు.