
విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్ బాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సర్కార్ జారీ చేసింది. ఆయన స్థానంలో రాజమండ్రి జాయింట్ కమిషనర్ భ్రమరాంబకు బాధ్యతలు అప్పజెప్పారు. దుర్గగుడి ఈవో తక్షణమే బాధ్యతలు చేపట్టాలంటూ ఆమెను ప్రభుత్వం ఆదేశించింది. దుర్గగుడిలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈవో సురేశ్ బాబు తీవ్రమైన ఆర్థిక తప్పిదాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ నివేదికను ప్రభుత్వానికి కూడా అందజేసింది. నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 20 మందికి పైగా ఉద్యోగులపై వేటు కూడా వేసింది. అమ్మవారి ఆస్తులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుందని, ఆలయ అధికారులు ఆస్తులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏసీబీ తన నివేదికలో పొందుపరిచింది. ప్రతి మూడేళ్లకో సారి ఆస్తుల వివరాలను అప్డేట్ చేయాలని, చాలా సంవత్సరాల పాటు ఈ అప్డేట్ కార్యక్రమమే జరగలేదని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.