భారీ ప్రీ రిలీజ్ బిజినెస్, భారీ అంచనాల మధ్య ఆచార్య!

Chiranjeevi Acharya Movie Pre Release Business Around 150 Crores.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ మరోసారి అలరించనుంది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉండగా, ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వదిలిన 'లాహే లాహే' సాంగ్ తో మణిశర్మ సంగీతానికి మంచి మార్కులు పడిపోయాయి. భారీ బడ్జెట్ తో కొరటాల మార్కుతో రూపొందుతున్న ఈ సినిమాను మూవీ మేకర్స్ మే 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ విషయానికొస్తే మెగాస్టార్ తన ఇమేజ్ కి తగ్గట్టు దుమ్ము లేపుతున్నాడు. నైజాం ఏరియాలో ఇప్పటికే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను 42 కోట్లకు రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రా, సీడెడ్ కలిపి 60 కోట్లకు పైగానే ఆచార్య బిజినెస్ జరిగిందని సమాచారం. గతంలో కొరటాల శివ సినిమాలకు, చిరు సినిమాలకు మంచి కలెక్షన్స్ రావటంతో అవి దృష్టిలో పెట్టుకొని 20 కోట్లకు పైగానే ఓవర్సీస్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు ముందుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈలెక్కన దాదాపు 140 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేస్తున్న ఈ సినిమా 150 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల కానుంది.

అయితే భారీ అంచనాలు ఉన్న ఆచార్య మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా కరోనావైరస్ పరిస్థితులు, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం మరోసారి వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆచార్య చిత్రానికి కీలకమైన వర్క్ ఇంకా మిగిలి ఉందట. ఆచార్య షూట్ మాత్రమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా తగినంత సమయం కావాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ పీరియడ్ పార్ట్ కొరకు హై-ఎండ్ విఎఫ్ఎక్స్ అవసరమట. మరోవైపు కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో  చిత్రనిర్మాతలలో తీవ్రమైన ఆందోళన నెలకొందట. మరి ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!