
వాషింగ్టన్ః కీలక సమస్యల విషయంలో భారత, పాకిస్థాన్ దేశాలు చర్చలకు ఉపక్రమిస్తే, వాటికి అమెరికా నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారానికి ఈ రెండు దేశాలు ఏ ప్రయత్నం చేసినా తమ సహాయ సహకారాలు ఉంటాయని అది ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే, భారతదేశం నుంచి పత్తిని, చక్కెరను దిగుమతి చేసుకోవడానికి పాకిస్థాన్ మంత్రివర్గం ఇటీవల నిర్ణయించడంపై మాత్రం అమెరికా విదేశాంగ శాఖ ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. ‘‘ప్రత్యేకంగా దీని మీద ఎటువంటి వ్యాఖ్యా చేయదలచుకోలేదు” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.
‘‘కీలక సమస్యల పరిష్కారానికి భారత, పాక్‌లు చర్చలకు సిద్ధపడితే వాటికి అమెరికా మద్దతునిస్తుందని మాత్రమే చెప్పదలిచాను” అని ఆయన అన్నారు.
భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్‌లో ఒక ఉన్నత స్థాయి కమిటీ అక్కడి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే, గత ఏప్రిల్ 1వ తేదీన పాకిస్థాన్ మంత్రివర్గం సమావేశమై, ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకూ ఆ దేశంలో సత్సంబంధాలను ఏర్పరచుకోవడం జరగదని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ స్పష్టం చేశారు.
భారత్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ ఆ దేశంతో చర్చలు, సంప్రదింపులు జరపబోమని ఆయన తెలిపారు.