పరిషత్ ఎన్నికలకు రైట్ రైట్.. వైసీపీకి ఊరట

AP High Court Green Signal to ZPTC Elections 2021

ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు జరగాల్సిన ఈ ఎన్నికలు నిలిపేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ బెంచ్‌ ఎన్నికల ప్రక్రియపై స్టే విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ అటు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇటు ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది. పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు చెప్పింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఫలితాలపై మాత్రం స్టే విధించింది.

ఈ నెల 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని అదే రోజు సాయంత్రం పరిషత్ ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దాని ప్రకారం ఈ నెల 8న పోలింగ్, 10న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. అయితే రాజకీయ పార్టీలను మరుసటి రోజు సమావేశాలకు ఆహ్వానించి.. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోకుండానే SEC షెడ్యూల్ ప్రకటించారంటూ విపక్షాలు ఆరోపించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన 21 రోజుల కోడ్ నిబంధనను SEC పట్టించుకోలేదని ఆరోపించాయి. ఇదే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు.

ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పోలింగ్ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఎన్నికల సామాగ్రిని వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలని, పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించాలని SEC ఆదేసించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 513 జడ్పీటీసీలు, 7వేల 230 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతోంది. జడ్పీటీసీ స్థానాలకోసం 2వేల 92 మంది, ఎంపీటీసీ స్థానాలకోసం 19వేల 2మంది పోటీ పడుతున్నారు. 33వేల 663 పోలింగ్ కేంద్రాల్లో 2కోట్ల 82లక్షల 15వేల 104 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 2లక్షల 1వెయ్యి 978మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 

పరిషత్ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్టు టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. ఇప్పటికే భారీగా ఏకగ్రీవాలను కైవసం చేసుకున్న వైసీపీ.. వీటిని కూడా క్లీన్ స్వీప్ చేస్తామనే నమ్మకంతో ఉంది. అయితే బీజేపీ, జనసేన, వామపక్షాలు మాత్రం తాము ఎన్నికల బరిలో ఉంటామని తేల్చి చెప్పాయి. మొత్తానికి పరిషత్ ఎన్నికల ప్రక్రియ మాత్రం తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.