షర్మిల సభకు చీఫ్ గెస్ట్ గా వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ

YCP Honorary President Vijayamma will be the Chief Guest at Sharmila Sabha

ఎల్లుండి ఖమ్మంలో షర్మిల పార్టీ ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. కనీసం లక్ష మందితో సభ నిర్వహించాలని షర్మిల భావించారు. అయితే లక్షమందితో సభ నిర్వహించుకునేందుకు పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదు. ఐదారు వేల మందికి మించి సభకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నందును మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే కోవిడ్ నిబంధనల మేరకే సభ నిర్వహిస్తామని షర్మిల అనుచరులు స్పష్టం చేశారు.

తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. షర్మిల పార్టీ ఏర్పాటు చేయడం జగన్ కు ఇష్టం లేదని.. వాళ్లద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అనేక వార్తలు వచ్చాయి. షర్మిల కూడా తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగాలంటూ నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టారు. దీంతో అన్నా చెల్లలి    మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని అర్థమైంది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. షర్మిల పార్టీ పెట్టొద్దనేదే జగన్ సూచన అని.. అయితే పార్టీ పెట్టాలా వద్దా అనేది పూర్తిగా షర్మిల ఇష్టమని తేల్చి చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో జగన్ సత్సంబంధాలు కోరుకుంటున్నారని..  అందుకే వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని క్లారిటీ ఇచ్చారు.

తాజాగా షర్మిల తల్లి విజయమ్మ కూడా ఇదే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. వివేకా హత్య నేపథ్యంలో బహిరంగ లేఖ రాసిన విజయమ్మ.. షర్మిల పార్టీపైన కూడా ప్రస్తావించారు. తెలంగాణ ఇంటి కోడలిగా అక్కడ తను పార్టీ పెట్టాలని షర్మిల నిర్ణయించారని.. అలాగే.. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాల దృష్ట్యా అక్కడ పార్టీని విస్తరించకూడదని జగన్ నిర్ణయించారని చెప్పారు. ఇవి వాళ్ల అభిప్రాయాలే కాదని.. వాళ్ల మధ్య విభేదాలు కాదని విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. కుటుంబసభ్యులుగా తామంతా ఒక్కటేనని స్పష్టం చేశారు.

అయితే.. వై.ఎస్. ఫ్యామిలీలో విభేదాలు తారస్థాయికి చేరారంటూ వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టే సందర్భం వచ్చింది. షర్మిల పార్టీకి కుటుంబం అండదండలు ఉన్నాయని.. ఫ్యామిలీలో ఎలాంటి గ్యాప్ లేదని చెప్పేందుకు వై.స్.కుటుంబం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఖమ్మం సభకు వై.ఎస్.విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. విజయమ్మ సమక్షంలోనే షర్మిల పార్టీని ప్రకటించబోతున్నారు. వై.ఎస్. కుటుంబసభ్యులు కూడా పలువురు ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. 9న విజయమ్మతో కలిసే షర్మిల హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరుతున్నారు. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ.. షర్మిల సభకు హాజరు కావడంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది.