గెలుపెవరిది?

who is win TANA Elections 2021

గత 12-14 సంవత్సరాల క్రితం తెలుగుటైమ్స్లో అప్పుటిరోజుల్లో ఉన్న రెండు పెద్ద తెలుగు సంఘాలు తానా, ఆటాల మీద ఓ ఆర్టికల్‍ రాస్తూ, వాటిని అప్పుట్లో ఆంధప్రదేశ్‍లో ఉన్న పెద్ద రాజకీయ పార్టీలు తెలుగు దేశం, కాంగ్రెస్‍ పార్టీలతో పోలుస్తూ ఒక కామెంట్‍ రాశాను. దాదాపు 15 సంవత్సరాల తరువాత మళ్ళీ ఆ వ్యాఖ్యని రాయవచ్చు అని అనిపించింది.  ఆటా సంస్థలోని సభ్యుల స్వభావం, సామాజిక వర్గం అప్పటి కాంగ్రెస్‍ పార్టీకి దగ్గరగా ఉండేలా కనిపిస్తుంటుంది. కాని సంస్థ పనితీరు మాత్రం అప్పటి తెలుగుదేశం పార్టీలాగా ఉండేది. ఎవ్వరూ మాట్లాడరు. నాయకులు నిర్ణయాలు తీసుకుంటాడు. మాట్లాడుతాడు. అంతే. అలాగే అప్పటి తానా సంస్థలో ఉన్న చాలామంది నాయకులు తెలుగు దేశం నాయకులులాగా ఉండేవారు. కాని వారి పనితీరు మాత్రం కాంగ్రెస్‍ లాగా ఉండేది. అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. మీడియాకి ఎక్కి ఏ విధంగానైనా మాట్లాడవచ్చు. వాదనలు చేయవచ్చు. విమర్శలకు దిగవచ్చు అన్నట్లుగా కనిపించేది. అది ఇప్పుడు బాగా కనిపిస్తోంది.  త్వరలో జరగనున్న తానా ఎన్నికల్లో గెలుపుకోసం నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికివారు తామే గొప్ప అంటూ, ఎదుటివాడు ఏమి చేయలేదంటూ విమర్శలు, వాదనలకు దిగుతున్నారు. చివరికి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోమోనని సాధారణ తానా సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాల్లో తానాకు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచ తెలుగు సంఘాలకు మాతృసంస్థలా, కమ్యూనిటీకి పెద్దన్నలా తానా వ్యవహరిస్తుంటుంది. దాదాపు 40వేలమందికిపైగా సభ్యులు ఉన్న తానా చేసే కార్యక్రమాలు కూడా భారీగానే ఉంటాయి. కోట్లాది రూపాయలను కమ్యూనిటీకోసం ఖర్చు చేయడంలో తానా ముందుంటుంది. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తూనే మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకోసం కూడా అనేక సేవా కార్యక్రమాలను తానా నిర్వహిస్తుంటుంది. తానా ప్రతి రెండళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు ఎంతోమందిని ఆకర్షిస్తుంటుంది. ఎంతోమంది పెద్దలు, రాజకీయ నాయకులు, సాంస్కృతిక కళాకారులు, సినిమా కళాకారులు ఇలా ఎంతోమంది ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతుంటారు.

తానా నిర్వహణను మూడు విభాగాలు చూస్తుంటాయి. కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్‍ కమిటి), తానా ఫౌండేషన్‍, బోర్డ్ ఆఫ్‍ డైరెక్టర్స్ విభాగాలు తానా కార్యక్రమాలు సక్రమంగా, విజయవంతమయ్యేలా చేస్తాయి. అన్నీ సంఘాలకు జరిగినట్లుగానే తానాలో కూడా కీలకమైన ఎగ్జిక్యూటివ్‍ కమిటీ పదవులకు, తానా ఫౌండేషన్‍ ట్రస్టీ, బోర్డ్ ఆఫ్‍ డైరెక్టర్స పదవులకు ఎన్నికలు జరుగుతుంటాయి. గతంలో ఇలాంటి పదవులకు పెద్దలే పోటీ పడటం జరిగేవి. యూత్‍ ప్రాబల్యం పెరిగిన తరువాత కొత్త నాయకులు కూడా పోటీలోకి రావడంతో పెద్దలు వెనక ఉండి నడిపించడం ప్రారంభించారు.

మారిన పరిస్థితులు...వేడెక్కిన ప్రసంగాలు

తానాలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు గతంలో జరిగిన దానికన్నా విభిన్నంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు తానాలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు ఓ వర్గానికి మద్దతిస్తుంటే, తానాలో ఇప్పటివరకు చక్రం తిప్పిన పెద్దలు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఆధిపత్యపోరును తలపిస్తోంది.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ ఇరువర్గాల మధ్యే జరుగుతోంది. ప్రస్తుత తానా ఫౌండేషన్‍ అధ్యక్షుడు నిరంజన్‍ శృంగవరపు, తానా మాజీ బోర్డ్ చైర్మన్‍ నరేన్‍ కొడాలి వర్గం మధ్య పోటీ ఉధృతంగా జరుగుతోంది. నిరంజన్‍ శృంగవరపు ప్యానెల్‍కు మద్దతుగా ప్రస్తుత అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, కాబోయే అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు రంగంలోకి దిగారు. నరేన్‍ కొడాలి టీమ్‍కు మద్దతుగా మాజీ అధ్యక్షులు జయరామ్‍ కోమటి, నాదెళ్ళ గంగాధర్‍, సతీష్‍ వేమన రంగంలోకి దిగారు.

నిరంజన్‍ ప్యానెల్‍ అభ్యర్థులు

నిరంజన్‍ శృంగవరపు ఎగ్జిక్యూటివ్‍ కమిటీ వైస్‍ ప్రెసిడెంట్‍ పదవికి పోటీ పడుతున్నారు. ఆయన ప్యానెల్‍ తరపున సెక్రటరీ పదవికి సతీష్‍ వేమూరి, ట్రజరర్‍ పదవికి అశోక్‍బాబు కొల్లా, జాయింట్‍ సెక్రటరీ పదవికి మురళీ తాళ్ళూరి, జాయింట్‍ ట్రెజరర్‍ పదవికి భరత్‍ మద్దినేని, కమ్యూనిటీ సర్వీస్‍ కో ఆర్డినేటర్‍ పదవికి రాజా కసుకుర్తి, కల్చరల్‍ సర్వీస్‍ కో ఆర్డినేటర్‍ పదవికి శిరీష తూనుగుంట్ల, ఉమెన్‍ సర్వీస్‍ కో ఆర్డినేటర్‍ పదవికి డా. ఉమ కటికి, ఇంటర్నేషనల్‍ కో ఆర్డినేటర్‍ పదవికి హితేష్‍ వడ్లమూడి, స్పోర్టస్ కో ఆర్డినేటర్‍ పదవికి శశాంక్‍ యార్లగడ్డ పోటీ పడుతున్నారు. బోర్డ్ డైరెక్టర్‍ల పదవికి జనార్దన్‍ నిమ్మలపూడి, డా. నాగేంద్ర శ్రీనివాస్‍ కొడాలి, ఫౌండేషన్‍ ట్రస్ట్రీస్‍ పదవులకు కిరణ్‍ గోగినేని, పురుషోత్తం చౌదరి గూడె, శ్రీకాంత్‍ పోలవరపు, శ్రీనివాస్‍ ఓరుగంటి, వినయ్‍ మద్దినేని పోటీ చేస్తున్నారు. వీరంతా నిరంజన్‍ ప్యానెల్‍ తరపున నిలిచారు.

నరేన్‍ కొడాలి ప్యానెల్‍ అభ్యర్థులు

నరేన్‍ కొడాలి ఎగ్జిక్యూటివ్‍ కమిటీ పదవికి పోటీ పడుతున్నారు. ఈయన టీమ్‍ తరపున సెక్రటరీ పదవికి భక్తబల్లా, ట్రెజరర్‍ పదవికి జగదీష్‍ ప్రభల, జాయింట్‍ సెక్రటరీ పదవికి వెంకట్‍ కోగంటి, జాయింట్‍ ట్రెజరర్‍ పదవికి సునీల్‍ పంత్ర, కమ్యూనిటీ సర్వీస్‍ కో ఆర్డినేటర్‍ పదవికి రజనీకాంత్‍ కాకర్ల, కల్చరల్‍ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ పదవికి సతీష్‍ తుమ్మల, ఉమెన్‍ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ పదవికి చాందిని దువ్వూరి, కౌన్సెలర్‍ ఎట్‍ లార్జ్ లోకేష్‍ నాయుడు, ఇంటర్నేషనల్‍ కో ఆర్డినేటర్‍ పదవికి హేమ కానూరు, స్పోర్టస్ కో ఆర్డినేటర్‍ పదవికి అనిల్‍ ఉప్పలపాటి, ఫౌండేషన్‍ ట్రస్టీ పదవులకు రవి మందలపు, సత్యనారాయణ మన్నె, వరప్రసాద్‍ యాదన, శ్రీనివాస్‍ ఎండూరి, రాజా సూరపనేని, బోర్డ్ డైరెక్టర్ల పదవులకు రవి పొట్లూరి, విజయ్‍ గుడిసేవ పోటీపడుతున్నారు.

ఉధృతంగా ప్రచారం

ఇరు వర్గాలు తమ విజయం కోసం ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నాయి. కోవిడ్‍ 19 భయాన్ని లెక్క చేయకుండా అభ్యర్థులంతా వివిద ఊర్లలో ప్రచారం చేసి తమను, తమ ప్యానెల్‍ను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు.

నిరంజన్‍ ప్యానెల్‍ ప్రచారం ఇలా...

నిరంజన్‍ శృంగవరపు తన ప్రచార యాత్రలో భాగంగా తన ప్యానెల్‍ అభ్యర్థులతో కలిసి వివిధ నగరాల్లో పర్యటిస్తున్నారు. ఒహాయో రాష్ట్రంలో క్లీవ్‍లాండ్‍, కొలంబస్‍ ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరంగా చేశారు. టెక్సాస్‍ రాష్ట్రంలో కూడా వివిధ చోట్ల పర్యటించి ప్రచారం చేశారు. డల్లాస్‍, ఫ్రిస్కో, ఇర్వింగ్‍, అస్టిన్‍, చికాగో, నార్త్ కరోలినా - రాలే, ఛార్లెట్‍, కాలిఫోర్నియా రాష్ట్రంలో శాక్రమెంటో, మిల్‍పిటాస్‍, శాన్‍రామన్‍ తదితర చోట్ల ఆయన తన ప్యానెల్‍ అభ్యర్థులతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇతర చోట్ల కూడా పర్యటించనున్నారు.

నరేన్‍ కొడాలి టీమ్‍ ప్రచారం...

నరేన్‍ కొడాలి కూడా తన ప్రచార యాత్రలో భాగంగా వివిధ చోట్ల పర్యటించారు. డల్లాస్‍, డిఎఫ్‍డబ్ల్యు, కొలంబస్‍, రాలే, జాక్సన్‍విల్‍, అట్లాంటా, హారీస్‍బర్గ్, ఒహాయో, మేరీలాండ్‍, న్యూజెర్సి, బోస్టన్‍లలో పర్యటించి ప్రచారం చేశారు. ఇంకా వివిధ చోట్ల కూడా ఆయన తన టీమ్‍తో కలిసి ప్రచారం చేయనున్నారు.

కౌంటర్‍కు...కౌంటర్‍...విమర్శలు ప్రతి విమర్శలు

రెండు వర్గాలు తమ ఎన్నికల ప్రచార పర్యటనలో ఒక వర్గం ఇంకో వర్గంపై చేసిన ఆరోపణలు, విమర్శలకు, కౌంటర్‍గా ఇంకో వర్గం ఇస్తున్న సమాదానాలు, ఆరోపణలు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించాయి. ముఖ్యంగా తానా పెద్దలుగా పేరు పొందిన జయరాం కోమటి, నాదెళ్ళ గంగాధర్‍తోపాటు సతీష్‍ వేమన కూడా నరేన్‍ కొడాలికి మద్దతుగా జరిగిన ప్రచార సభల్లో మాట్లాడుతూ నిరంజన్‍ వర్గంపై, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్‍ జయ్‍ తాళ్ళూరిపై, కాబోయే ప్రెసిడెంట్‍ అంజయ్య చౌదరిలపై విమర్శలు చేస్తూ మాట్లాడారు. తానాను అభివృద్ధి చేయాలంటే అనుభవం ఉండాలని, కొద్దికాలంలోనే ప్రెసిడెంట్‍లు అయిపోదామనే ఆశతోనే వారు పోటీలోకి దిగారని వారు తమ ప్రచారంలో మాట్లాడుతూ, పేర్కొంటే, ఇందుకు ప్రతిస్పందనగా జయ్‍ తాళ్ళూరి మాట్లాడుతూ, తాము ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదని, పని చేశామా లేదా, కమ్యూనిటీకి గతంలో ఎన్నడూ జరగని విధంగా సేవ చేసామా లేదా అన్నదే ముఖ్యమని చెబుతూ ఎప్పుడొచ్చాం కాదు అన్నయ్యా బుల్లెట్‍ దిగిందా లేదా అన్న సినిమాటిక్‍ డైలాగ్‍తో ప్రచారాన్ని మరింత వేడెక్కించారు. దీంతో మరోసారి సతీష్‍ వేమన తనదైన మాటలతో జయ్‍తాళ్ళూరి వర్గంపై విరుచుకుపడ్డారు. ఇలా పెద్దలతోపాటు, ఇప్పుడు ఉన్న వారు కూడా తమ మాటలతో, విమర్శలతో ప్రచారాన్ని వేడెక్కించారు.

గెలుపు ఎవరిది?

ఇంతవరకు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఈ ఎన్నికల్లో ఎవరూ గెలిచినా, అది తానాలో పెద్ద మార్పును తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. అది నిరంజన్‍ వర్గం చెబుతున్న మార్పా లేదా నరేన్‍ వర్గం తీసుకురానున్న మార్పా అన్నది ఎన్నికల అనంతరం జరిగే పరిణామాలను బట్టి తెలియనున్నది. రెండువర్గాలకు వివిధ చోట్ల బలాబలాలు బాగా ఉండటంతో గెలుపు ఎటువైపు ఉందో ఇప్పుడు చెప్పడం కష్టమే. కాని రెండు వర్గాలు ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలోకి దిగడం తానాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థకు ఎంతమాత్రం మంచి విషయమైతే కాదు. అందులోనూ తానాలో పెద్దలుగా చెలామణి అవుతున్న జయరాం కోమటి, నాదెళ్ళ గంగాధర్‍ లాంటి వాళ్ళు తమ వర్గం అంటూ నరేన్‍కు మద్దతుగా ముందుకు రావడం, అదే సమయంలో నిరంజన్‍ వర్గానికి మేము మద్దతుగా ఉన్నామంటూ ప్రెసిడెంట్‍గా ఉన్న జయ్‍ తాళ్ళూరి, కాబోయే ప్రెసిడెంట్‍ అంజయ్య చౌదరి రావడం ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు.

ఏదీ ఏమైనా ఏ వర్గం గెలిచినా తరువాత అందరూ కలిసి పనిచేయాల్సి ఉన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకుని ప్రచారపర్వంలో దూషణలు, భేషజాలకు ఇకనైనా దిగకుండా ఉంటే మంచిది. తానాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థకు పోటాపోటీ ప్రచారాలు, ఆరోపణలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండకూడదన్నదే తానాలోని రెండువర్గాలకు చెందని వారి అభిప్రాయంగా వినవస్తోంది.