వాళ్లను అడ్డుకోకపోతే రక్తపాతమేనంటున్న పవన్ కల్యాణ్..!

Pawan Kalyan fires on YCP Govt

పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించినట్లు జనసేన చెప్తోంది. మిత్రపక్షమైన బీజేపీ కంటే జనసేనకు అధికస్థానాలు వచ్చాయని ప్రకటించింది. వైసీపీ, టీడీపీ తర్వాత ఓటు బ్యాంక్ కూడా తమకే ఎక్కువని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఓవరాల్ గా 27 శాతం ఓట్లు వచ్చాయనేది ఆ పార్టీ చెప్తున్న మాట. అదే ఉత్సాహం ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపించాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ వీడియో సందేశం ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో 27 శాతం ఓట్లను జనసేన సాధించిందని ప్రకటించారు. అదే ఉత్సాహం, ఆదరణ.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో మార్పు మొదలైందని.. ఈ మార్పే ఇప్పుడు వైసీపీకి భయం పుట్టిస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు బెదిరింపులకు, కిడ్నాపులకు, రక్తపాతానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రత్యర్థులను నామినేషన్లు కూడా వేయనివ్వకుండా భయపెట్టారని చెప్పారు. అయినా జనసేన అభ్యర్థులు ఎదురొడ్డి ఎన్నికల బరిలో నిలిచారని.. వైసీపీ వాళ్లను వదిలేస్తే ఇలాగే పేట్రేగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురించే వ్యక్తులు లేకుంటే వీళ్ల దాష్టీకానికి అంతే లేకుండా పోతుందన్నారు పవన్ కల్యాణ్. అందుకే పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వైసీపీ దాష్టీకాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

బిజెపితో కలిసి జనసేన పార్టీ సంయుక్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్న పవన్ కల్యాణ్.. రెండు పార్టీల ఆలోచనా విధానంతో అతి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ దాష్టీకానికి, అవినీతికి, గూండాయిజానికి ఎదురొడ్డి నిలబడేది జనసేన, బీజేపీ పార్టీలు మాత్రమేన్నారు పవన్. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 


                    Advertise with us !!!