అబ్బనీ తియ్యనీ దెబ్బ.. అంటున్న బాలయ్య బాధితుడు!

Balakrishna Fan Reaction on Balayya Slaps

హిందూపురంలో ఇవాళ ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ.. టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. మూడ్రోజులుగా హిందూపురంలోనే తిష్టవేసి గల్లీగల్లీ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఓ అభ్యర్థి ఇంటికెళ్లిన బాలయ్య.. అక్కడ వీడియో తీస్తున్న అభ్యర్థి కుమారుడిపై చేయి చేసుకున్నాడు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

స్థానిక పదో వార్డులో టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఇంటికి వెళ్లారు బాలకృష్ణ. అక్కడ అభ్యర్థి భర్తతో రహస్యంగా మాట్లాడుతున్న సమయంలో అతని కుమారుడు వీడియో తీస్తుండడం బాలకృష్ణ కంటపడింది. దీంతో ఆగ్రహించిన బాలకృష్ణ.. అక్కడి నుంచి లేచి అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పరిస్థితి తేడాగా ఉందని భావించి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.

అయితే.. ఆ తర్వాత బాధితుడు మీడియాతో మాట్లాడాడు. తనపై బాలకృష్ణ చేయి చేసుకోలేదంటూనే.. తనకెంతో సంతోషంగా ఉందంటున్నాడు. ప్రచారంలో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని బాలయ్య.. తనను తాకడం ఎంతో హ్యాపీగా ఉందన్నాడు. తాను బాలకృష్ణకు వీరాభిమానినని.. తనను తాకడం గర్వంగా ఉందని పొంగిపోయాడు. ఎవరో అనుకుని తనపై చేయిచేసుకున్నాడని చెప్పాడు. అయితే కొంతమంది దీనిపై కావాలనే రాద్దాంతం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

బాలకృష్ణ గతంలో చేయి చేసుకున్నవాళ్లు కూడా ఇలాగే స్పందించారు. తమను బాలకృష్ణ తాకడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. తాము బాలయ్యకు వీరాభిమానులమని.. ఇది తమకు ఏమీ బాధకలిగించట్లేదని చెప్పుకొచ్చారు. బాధితుల స్పందన చూసిన వాళ్లంతా.. వీరాభిమానమంటే ఇదే కాబోలు.. అనుకుంటున్నారు. ఏదేమైనా బాలకృష్ణకు ఎంత కోపమొచ్చినా.. ఆయన అభిమానుల మనసు మాత్రం వెన్న.. 

 


                    Advertise with us !!!