
వైకాపా ప్రభుత్వానికి చెక్‌పెట్టే ఏకైక పార్టీ బీజేపీనే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప విచ్చేసిన ఆయన.. నగరంలోని పలు వార్డులో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు అధికారులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు అధికారులు మొదలుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ శాఖ మొత్తం అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందన్నారు. రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఇష్టానుసారంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో 151 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్ ప్రజామద్దతు లేకనే ఇలాంటి దొడ్డిదారి పనులు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ జగన్ పేరుతో ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు సాధ్యమని సోము ధీమా వ్యక్తం చేశారు.