అలాంటి వారికి సరైన సమయంలో బదులిస్తాం : కేటీఆర్

KTR Interact with Students at TRS Bhavan

ప్రతికూల పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‍ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‍ఎస్‍)ని స్థాపించారని ఆ పార్టీ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‍ అన్నారు. తెలంగాణ భవన్‍లో టీఆర్‍ఎస్‍ విద్యార్థి విభాగం నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్‍ 27 నాటికి తెలంగాణ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతుందన్నారు. పార్టీని స్థాపించిన సమయంలో కేసీఆర్‍కు మీడియా, మనీ, మజిల్‍ పవర్‍ ఏమీ లేదని గుర్తు చేశారు. నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణను సాధించారని కొనియాడారు. అయితే కొందరు సీఎం పట్ల ఎలాంటి గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గోడకు వేలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని, తమ మౌనాన్ని బలహీనతగా భావించొద్దని కేటీఆర్‍ హెచ్చరించారు. బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఆరేళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ వస్తుందని ఆరోపించారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను విద్యార్థి విభాగం నేతలు తిప్పికొట్టాలని కేటీఆర్‍ మార్గనిర్దేశం చేశారు.

వాట్సాప్‍ వర్సిటీలో బీజేపీ నేతలు అబద్దాలు నేర్చుకుంటున్నారు. వాట్సాప్‍ను ఉపయోగిస్తూ బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‍ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం చేసింది సున్నా. రాష్ట్రానికి రావాల్సిన సంస్థలను కూడా ఇవ్వట్లేదు. తెలంగాణకు నవోదయ విద్యాలయాలు ఇవ్వడం లేదు. కొత్త వైద్య కళాశాలల్లో తెలంగాణకు మొండి చేయి చూపించారు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. దూషణలు చేస్తున్న వారికి సరైన సమయంలో బదులిస్తాం అని అన్నారు.

 


                    Advertise with us !!!