బెజవాడ టీడీపీలో అంతర్గతపోరు..! కేశినేనిపై నేతల ఫైర్..!

Clash Between Buddha Venkanna and Kesineni Nani Groups

బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇక్కడి నేతలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అంతర్గత రాజకీయాలు మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే బెజవాడ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటాయి. 

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుంది. వైసీపీ అధికారంలో ఉన్నా జిల్లాలో టీడీపీకి ఎంతో ఆదరణ ఉంది. తెలుగుదేశం పార్టీ గెలిచిన పార్లమెంటు స్థానాల్లో ఒకటి విజయవాడ. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్ని చోట్లా వైసీపీ గెలిచింది. అయినా కేశినాని నాని మాత్రం విజయవాడ నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీన్నిబట్టి ఆయనకు బెజవాడపై ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇటీవల బెజవాడ తెలుగుదేశంలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కేశినాని నాని కుమార్తె కేశినేని శ్వేతను టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. అంతేకాదు. కేశినేని చెప్పినట్లే డివిజన్ అభ్యర్థులను ఖరారు చేసింది అధిష్టానం. దీంతో కేశినేని నాని వ్యతిరేక వర్గం అస్సలు సహించలేకపోతోంది. దీంతో ఆయనపై బాహాటంగానే విమర్శలు చేస్తోంది.

గతవారం 39వ డివిజన్ అభ్యర్థి కోసం కేశినేని నాని, బుద్ధావెంకన్న, నాగుల్ మీరా వర్గాలు పోటీ పడ్డాయి. అయితే అక్కడ తమ వర్గానికే చెందిన అభ్యర్థే పోటీ చేస్తారంటూ కేశినేని తేల్చి చెప్పారు. దీన్ని బుద్ధా వెంకన్న వర్గం సీరియస్ గా తీసుకుంది. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా కేశినేని నానియే గెలిచారు. ఆయన చెప్పిన అభ్యర్థినే అధిష్టానం ఖరారు చేసింది. చంద్రబాబును కలిసిన అనంతరం.. తామంతా కలిసే పనిచేస్తామని మీడియా ముందు కూడా చెప్పారు. 

అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్ధా వెంకన్న వర్గం ఏకమైంది. బొండా ఉమ నివాసంలో భేటీ అయిన ఈ వ్యతిరేకవర్గమంతా మీడియా ముందుకొచ్చింది. కేశినేని నానిపై సీరియస్ అయింది. బుద్ధా వెంకన్న అయితే మరీ నిప్పులు చెరిగారు. చెప్పుతో కొట్టేవాణ్ణి అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబును కేశినేని ఏకవచనంతో సంబోధిస్తున్నాడని.. చిటికెలు వేసి తానే విజయవాడకు అధిష్టానం అని చెప్తున్నాడని.. చంద్రబాబుపై గౌరవంతో ఇన్నాళ్లూ భరిస్తూ వస్తున్నామని చెప్పాడు. లేకుంటే ఆరోజే చెప్పుతో కొట్టేవాణ్ణి అని మండిపడ్డారు. బొండా ఉమా కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. కేశినేని నాని కావాలో.. మేం కావాలో తేల్చుకోవాలంటూ అధిష్టానానికి సవాల్ విసిరారు. 

ప్రస్తుతం విజయవాడ టీడీపీలో అంతర్గత పోరు ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో.. ఇలా బరితెగించి వీధిన పడడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. విజయవాడను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే టీడీపీలో ఈ పరిణామాలు ఆ పార్టీ శ్రేణులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు.

 


                    Advertise with us !!!