ట్రంప్ విడగొట్టిన కుటుంబాలను కలిపే పనిలో బైడెన్!

biden-addresses-one-of-the-most-critical-challenges-he-inherited-the-situation-on-the-southern-border

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల విడిపోయిన కుటుంబాలను కలిపే పనిలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బిజీగా ఉన్నారు. ట్రంప్ హయాంలో అమెరికా సరిహద్దుల విషయంలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ‘జీరో టోలరెన్స్’ విధానం ఒకటి. అయితే ఈ చట్టం వల్ల చాలా మంది వలసల కుటుంబాలు వేరైపోయాయి. ఇప్పుడు వీళ్లందరినీ కలిపేందుకు బైడెన్ సర్కారు నడుం బిగించింది. జీరో టోలరెన్స్ విధానం వల్ల కుటుంబాలకు దూరమైన వాళ్లను మళ్లీ అమెరికాలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇలాగే తిరిగి వచ్చే వలసదారులకు రవాణా, ఆరోగ్యం, న్యాయ సేవలు, జీవనోపాధి, విద్య వంటి సేవలన్నింటికీ అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వెల్లడించింది.

బైడెన్ చర్యలు..

ఈ కుటుంబాలను కలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేకంగా ఫ్యామిలీ రీయూనియన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ట్రంప్ హయాంలో విడిపోయిన సుమారు 500 మంది పిల్లలు, తల్లిదండ్రులను ఒకచోటకు చేర్చడమే ఈ టాస్క్ ఫోర్స్ పని. ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 2న బైడెన్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. దీని ప్రకారం పిల్లల నుంచి విడిపోయి అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిన తల్లిదండ్రులను తిరిగి అమెరికా తీసుకొచ్చే విషయంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని విధివిధానాలను బైడెన్ పాలక వర్గం ఇప్పటికే ప్రటించింది కూడా.

‘‘తల్లిదండ్రులను, వారి నుంచి క్రూరంగా విడగొట్టిన పిల్లలను మళ్లీ కలిపేందుకు మేం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేస్తున్నాం. దీని కోసం అన్ని ప్రభుత్వ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెంల్యాండ్ సెక్యూరిటీ వనరులన్నింటినీ ఉపయోగించాలని నిర్ణయించాం’’ అని డీహెచ్ఎస్ సెక్రటరీ అలెజాండ్రో మాయోర్కాస్ ఓ ప్రకటనలో తెలిపారు.

 


                    Advertise with us !!!