
అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదటి వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఇండో అమెరికన్ నౌరిన్ హసన్ నియామకమయ్యారు. ఈ విషయాన్ని ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె ఎన్నికను గవర్నర్స్ బోర్డ్ ఆమోదించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా న్యూయార్క్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ విలియమ్స్ మాట్లాడుతూ ఆమె నియామమకం ఈ నెల 15 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా నౌరీన్ హసన్‌ను స్ఫూర్తిదాయకమైన నాయకురాలిగా అభివర్ణించారు. ఆమెతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.
బ్యాంక్ మిషన్, వ్యూహాత్మక ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లడంతో నౌరీన్ కీలక పాత్రను నిర్వహిస్తారని లోకల్ ఇనిషియేటివ్స్ సపోర్ట్ కార్పొరేషన్ (ఎల్ఐఎస్సీ) ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్, న్యూయార్క్ ఫెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డెనిస్ స్కాట్ పేర్కొన్నారు. కాగా, ఫైనాన్షియల్ సర్వీస్ రంగంలో నౌరీన్ హసన్‌కు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె తల్లితండ్రులు కేరళ నుంచి అమెరికా వెళ్లారు. నౌరీన్ హసన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు.