బైడెన్ పాలక వర్గంలో భారతీయ అమెరికన్లు.. ఇప్పటికి 55 మంది..

Indian Americans taking over US says Biden as 55 with Indian descent get key posts

‘‘భారతీయ అమెరికన్‌లు అమెరికాను స్వాధీనం చేసేసుకుంటున్నారు. స్వాతీ... మీరు, మా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, నా ఉపన్యాసాల రచయిత వినయ్‌ రెడ్డి... ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అయితే, మీ అందరికీ కృతజ్ఞతలు. మీరంతా అద్భుతమైన వ్యక్తులు.’’ అంటూ భారతీయ అమెరికన్లపై చమత్కార బాణాలు సంధించింది ఎవరో కాదు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

ఫిబ్రవరి 18న అంగారకుడి మీదకు  రోవర్‌ను పంపించిన నాసా శాస్త్రవేత్తల బృందంతో ఆయన మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో కీలక భూమిక పోషించిన స్వాతి మోహన్‌తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆమె ధన్యవాదాలు చెప్పబోతుంటే అడ్డుకున్న బైడెన్.. ఆమెతో మాట్లాడటం తనకు దక్కిన గౌరవం అని చెప్పడం అమెరికాలో భారతీయ అమెరికన్ల హవా ఎంతలా ఉందో చెప్పకనే చెప్తోంది. తాజాగా శ్వేతసౌధం నుంచి శుక్రవారం నాడు ఓ ప్రకటన విడుదలైంది. కొత్తగా బైడెన్ పాలక వర్గంలో చేరుతున్న 20 మంది వివరాలు దానిలో ఉన్నాయి. వీరిలో కూడా మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు ఉన్నారు. చిరాగ్ బైన్స్‌ను ప్రెసిడెంట్ ఫర్ క్రిమినల్ జస్టిస్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించగా, ప్రోనితా గుప్తాను ప్రెసిడెంట్ ఫర్ లేబర్ అండ్ వర్కర్స్ శాఖ ప్రత్యేక అసిస్టెంట్‌గా నియమించారు. వీళ్లిద్దరితో కలిపి బైడెన్ పాలక వర్గంలోని భారతీయ అమెరికన్ల సంఖ్య 55కు చేరింది.

గతంలోనూ వైట్‌హౌస్‌లో మనవాళ్లు..

వైట్‌హౌస్‌లో అత్యధిక భారతీయులకు పదవులు కల్పించిన ఘనత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కే దక్కుతుంది. గతంలో కూడా చాలా మంది అధ్యక్షుల ప్రభుత్వాల్లో భారతీయులకు పెద్ద పీట వేసినా బైడెన్ ఇచ్చినన్ని పదవులు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. బైడెన్ అవకాశాలు ఇచ్చిన 55మందిలో కూడా సగం మంది మహిళలే కావడం గమనార్హం. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎన్నికల్లో గెలిచి పదవి చేపట్టారు. గతంలో ఒబామా హయాంలో కూడా భారతీయులకు బాగానే అవకాశాలు ఇచ్చి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో గెలిచిన ట్రంప్ హయాంలో శ్వేతసౌధంలో భారతీయుల సంఖ్య కాస్త తగ్గి 36కు చేరింది. కానీ వారి ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. భారతీయ మహిళ నిక్కీ హేలీని ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో అమెరికా తరఫున నియమంచిన ట్రంప్.. భారతీయులకు కేబినెట్ హోదా కల్పించిన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. ఇక బైడెన్ వచ్చిన తర్వాత వేరే చెప్పక్కర్లేదు.

భారతీయుల హవా ఎంతలా అంటే..

తాజాగా వెల్లడైన కొన్ని విషయాలు చూస్తే అమెరికాలో భారతీయుల హవా ఎంతలా ఉందో తెలుస్తుంది. ఇక్కడి భారతీయ మూలాలున్న వ్యక్తుల్లో 25 ఏళ్లు నిండిన వారిలో 70శాతం మంది డిగ్రీ పట్టా పొందినవారే. వారిలో 40 శాతం మంది పీజీ కూడా సాధిస్తున్నారు. మొత్తం అమెరికా జనాభాతో పోల్చుకుంటే ఇది 2.5 రెట్లు ఎక్కువ. అలాగే అమెరికాలోని భారతీయ కుటుంబాల సంపాదన కూడా మిగతా వారితో పోల్చుకుంటే ఎక్కువే. ఇక్కడి భారతీయ అమెరికన్ కుటుంబాలు 132,000 డాలర్లు సంపాదిస్తున్నాయి. అదే సమయంలో మిగతా దేశాల వలసలు, అమెరికన్ కుటుంబాల ఆదాయాలు మాత్రం 64 వేల డాలర్ల నుంచి 66 వేల డాలర్ల మధ్యే ఉన్నాయి.


                    Advertise with us !!!