ఎన్నికల వేళ సీఎం పినరయ్ మెడకు చుట్టుకున్న బంగారం...

kerala-gold-dollar-smuggling-case-kingpin-swapna-suresh-names-cm-pinarayi-vijayan-3-cabinet-ministers

ఎన్నికల సమయంలో ప్రతి సెకనూ అత్యంత విలువైనదే. ఏ వ్యవహారం చేసినా, ఏ విమర్శలు వచ్చినా... అత్యంత జాగరూకతతో వాటి ముళ్లను విప్పి, ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సరిగ్గా ఎన్నికల సమయంలో సీఎం పినరయ్ విజయన్ మెడకు ‘బంగారం’ చుట్టుకుంది. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు పెద్ద సంచలనమే రేపింది. దీనిలో సీఎం పినరయ్ పాత్ర కూడా ఉందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అయితే అందులో ప్రధాన సూత్రధారి స్వప్న సురేశ్ కూడా తాజాగా అవే ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని, ఈ వ్యవహారంలో ఆయనా నిండా మునిగిన వ్యక్తే అని కస్టమ్స్ విచారణలో స్వప్న సురేశ్ స్పష్టం చేసింది. ఈ విస్పష్టమైన ప్రకటనతో సీఎం పెద్ద చిక్కుల్లోనే పడ్డారు. ఈ ఆరోపణలపై ఆయన ఇప్పటి వరకూ స్పందించలేదు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్‌ను శుక్రవారం కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలోనే ఆమె సీఎం పేరును బయటపెట్టారు. సీఎంతో పాటు మరో ముగ్గురు మంత్రులు, స్పీకర్ కూడా ఉన్నారని ఆమె వెల్లడించింది. ‘‘సీఎం విజయన్‌కు అరబ్బీ భాష రాదు. ఆయన మాట్లాడలేరు. కాన్సులేట్‌కు, సీఎం విజయన్‌కు మధ్య స్వప్న సురేశ్ అనుసంధాన కర్తగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో సీఎంతో సహా మంత్రులకు కూడా కోట్లాది రూపాయలు కమిషన్ల రూపంలో ముట్టాయని స్వప్న సురేశ్ విచారణలో తెలిపారు.’’ అని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు నివేదించారు. 

మేము అన్నదే నిజమైంది : కాంగ్రెస్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ హస్తముందని ముందునుంచీ తాము ఆరోపిస్తూనే ఉన్నామని, అదే నిజమైందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల వ్యాఖ్యానించారు. మొదటి నుంచి తాము ఊహిస్తూనే ఉన్నామని, దీనికి సీఎం సమాధానం చెప్పాలని చెన్నితల డిమాండ్ చేశారు. అంతకు పూర్వం కూడా చెన్నితల ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేరళలో జరిగిన అతిపెద్ద నేరాల్లో ఇదొకటని పేర్కొన్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితునికి అండర్ వరల్డ్ డాన్ దావూద్‌తో సంబంధాలు ఉన్నాయని వెల్లడి కావడం దురదృష్టకరమన్నారు. నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోందని ఆరోపించారు. అవినీతి కేసుల్లో సీఎం కార్యాలయం చిక్కుకోవడం మన దేశంలో ఇదే ప్రథమమని విరుచుకుపడ్డారు. పినరయ్ చూసే శాఖలన్నీ అవినీతిమయమేనని, అన్నీ అవినీతితో కంపు కొడుతూనే ఉన్నాయని విమర్శించారు. 

ఏం జరిగిందంటే....

తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు విలువ చేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అప్పట్లో ఈ వ్యవహారం కేరళ రాజకీయాన్ని కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ పైనే ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఆమె చుట్టే ఈ వివాదం నడుస్తోంది. దీంతో అప్పట్లోనే ఆమెను ఐటీ శాఖ నుంచి తొలగించారు. యూఏఈ రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి ఈ స్వప్న. తన పరిచయాలను తెలివిగా వాడుకుంటూ గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని కేరళకు స్మగ్లింగ్ చేస్తోంది. డిప్లమాటిక్ వీసాలను అడ్డంపెట్టుకొని ఆమె ఈ వ్యవహారం సాగిస్తోంది. అయితే ఈమె సీఎంవోలో కీలక ఉద్యోగి కావడంతో ఈ కేసు సీఎం మెడకు చుట్టకుంది


                    Advertise with us !!!